ఆకాశంనుంచి రాలిన చినుకులు నేలమీద పడి మట్టిని పలకరిస్తాయి అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత  ' యుగళగీతం ' ఇక్కడ చదవండి : 

వర్షంలో ఓ చెట్టు 
తడిసి ముద్దవుతుంది
దేహమంతా పరవశించి పోతుంది

ఆకాశంనుంచి రాలిన చినుకులు 
ఆకుల మీంచి ముత్యాల్లా జారి
నేలమీద పడి మట్టిని పలకరిస్తాయి

అప్పటికే తడిసి పులకరించిన నేల
చెట్టువైపు మట్టి పెదాలతో
చిరునవ్వు విసుర్తుంది

కొంచెంసేపటికి వర్షం నిలిచిపోతుంది 

విసురుగా వీస్తున్న చల్లగాలికి 
వణుకుపుట్టిన చెట్టు ఒళ్ళు విరుచుకుని
కొమ్మలన్నింటినీ పైకెత్తి 
ఆకులన్నింటినీ అందంగా చాపి 
ఆకాశానికి కృతజ్ఞతలు చెబుతుంది 

నేల తన గొంతుకలిపి 
'యుగళ గీతం' పాడుతుంది