Asianet News TeluguAsianet News Telugu

వారాల ఆనంద్ కవిత : పీట లేని అమ్మ

అమ్మ ఎప్పుడు నిద్రపోయేదో  మళ్ళీ  పొద్దున్నే  ఎప్పుడు లేచేదో నాకయితే మతికి లేదు అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత '  పీట లేని అమ్మ ' ఇక్కడ చదవండి : 

Varala Anand's poetry - bsb
Author
First Published Apr 4, 2023, 12:01 PM IST

ఇంట్లో అందరం భోజనాలకు కూర్చున్నప్పుడు 
అందరికీ పీటలుండేవి 
ఒక్క ‘అమ్మ’కు తప్ప 

పీటల ముందు కంచమో విస్తరో పరిచి 
అన్నం పప్పు చారు కూరా పెరుగూ 
నడుం వంచుతూ లేస్తూ 
ఎవరికేది ఇష్టమో ఏదవసరమో   
అమ్మ అందరికీ వడ్డించేది 
 
నాకోక్కోసారి సరం తప్పితే 
‘అంత ఆగమెందుకు, మెల్లగతిను
బయట ఏం మావులాలున్నాయి’ అంటూ 
నెత్తిమీద సర్సి గుక్కెడు నీల్లిచ్చేది 

అందరం పీకల్దాకా తిని 
బయటకొచ్చి ఏ చాపో పరుపో 
కాళ్ళు బార్లా చాపుకుని పడుకునేటోల్లం 

వంటింట్లో అమ్మ 
అడుగూ బొడుగూ మిగిలిందేదో తిని
ఇల్లు కడిగి పొయ్యి తుడిచి 
చీర కొంగుతో మూతి తుడుచుకుంటా వచ్చేది     

అప్పటికి అంతా నిద్రలో గురకలు పెట్టేవాళ్ళం 
ఒక్క ‘నాన్న’ తప్ప 

తర్వాత 
అమ్మ ఎప్పుడు నిద్రపోయేదో  
మళ్ళీ  పొద్దున్నే  ఎప్పుడు లేచేదో 
నాకయితే మతికి లేదు 

                                       వారాల ఆనంద్
                                       94405 01281
 

Follow Us:
Download App:
  • android
  • ios