Asianet News TeluguAsianet News Telugu

అందుకున్నాను: చీకటి కాలంలో గానం

ప్రముఖ సాహిత్యవేత్త వారాల ఆనంద్ కొత్త కాలమ్ 'అందుకున్నాను' ఏషియానెట్ న్యూస్ సాహిత్య విభాగంలో నేటి నుండి  ప్రారంభమవుతోంది.  ప్రతి సోమవారం ఈ  శీర్షిక కింద  పుస్తకాలను పరిచయం చేస్తారు.

Varala Anand reciews Singing in the dark, edited by Sachidanand
Author
Hyderabad, First Published Jul 26, 2021, 2:45 PM IST

మిత్రులారా ,

కొన్ని రోజుల క్రితం   నాకిష్టమయిన  కవి   సచ్చిదానందన్ సహసంపాదకుడుగా వున్న SINGING IN THE DARK  ‘చీకటి  కాలంలో గానం’  సంకలన వివరాలు ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ చేసాను. ఆ గ్లోబల్ సంకలనాన్ని అందుకోగానే ప్రపంచం లో కవులు రచయితలూ అంతా దుఃఖ కాలంలో దాదాపుగా ఒకే గొంతుకతో ఎట్లా స్పందిస్తారో చూసి మనసంతా తడి తడి అయిపోయింది. కొందరి అనుభవాలు  వ్యక్తిగతమయినవి, మరి కొందరివి విన్నవి, చూసినవీ కావచ్చు కాని స్పందన మాత్రమే ఒకే స్థాయిలో వుండడం ఇంకా మనుషుల్లో కదిలే గుణం బతికే వుంది అనిపించింది. కే. సచ్చిదానందన్, నిశి చావ్లాల సంయుక్త సంపాదకత్వంలో వచ్చిన ఈ 360 పేజీల సంకలనం కవిత్వపరంగా ఎంత గాఢంగా వుందో ప్రచురించిన తీరు కూడా అంత ఈస్తటిక్ గా వుంది. అతి తక్కువ సమయంలో అనేక దేశాల కవుల కరోనా కాలపు కవితల్ని సేకరించి కూర్చిన సంపాదకుల్ని మనసారా అభినందించాల్సిందే.
*****

ఏమి కాలమిది...

భయం పరిణామం చెంది
దుఖంగా రూపుదాల్చుతోంది
బతుకు వేదనై  రోదనై
స్మశానం వైపు చూస్తున్నది ...

ఎన్నడూ ఊహించని అలాంటి కాలంలో ఎలాంటి అనుభవాల్ని చూసాం. లాక్ డౌన్, సాంఘిక దూరం, మాస్క్,సానిటైసర్ లాంటి అనేక కొత్త మాటల్ని విన్నాం. ఇంట్లోస్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. ఆప్తుల్ని, ఆత్మీయుల్నీ,  తెలిసినవాల్లనీ, మంగలేష్ డబ్రాల్ లాంటి కవుల్నీ,  బాలసుబ్రహ్మణ్యం లాంటి కళాకారుల్నీ కోల్పోయాం.  పోగొట్టుకున్న వాళ్ళ చివరి చూపునకూ దూరయ్యాం. కార్మికుల వందలాది మైళ్ళ కాలి నడకల్నీ చూసాం. ఎంత ఘోరమయిన కాలాన్ని అనుభవించామో చెప్పలేము. 

ఈ నాణేనికి మరో వైపు గంగానది పరిశుభ్రమయిందనీ, ఢిల్లీలో  వెన్నెల ప్రకాశవంతమయిందనీ, రోడ్లమ్మట జంతువులు స్వేచ్చగా సంచరించగలుగుతున్నాయనీ విన్నాం.

వీటన్నింటి నేపధ్యం లో సామాజిక దూరం ఇప్పటికే దూరమవుతున్న మనల్ని మరింత దూరం చేసింది.  ఇలాంటి స్థితిలో గ్లోబల్ స్థాయిలో కవుల కవితలతో కూడిన ఈ SINGING IN THE DARK లో  వివిధ  దేశాలకు చెందిన 112 మంది కవుల కవితలున్నాయి. కొందరు కవులు దుఖంతో రాస్తే, కొందరు కోపంతోనూ మరికొందరు ధైర్యాన్ని ప్రోది చేస్తూనూ రాసారు. తప్పకుండా చదవాల్సిన సంకలనమిది.  

*****

ఈ సంకలనం లోంచి ఒకటి రెండు కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదం చదవండి.

రైలు –కే. సచ్చిదానందన్

రైలు మా వూరికి వెళ్తోంది
నేనందులో లేను కానీ
రైలు పట్టాలు నాలోపలున్నాయి
రైలు చక్రాలు నా చాతీపై నున్నాయి
రైలు కూత నా అరుపు
నన్ను తీసుకెళ్ళడానికి రైలు తిరిగి వచ్చినప్పుడు
నేనక్కడ ఉండను కానీ
నా శవాన్ని కాపలా కాస్తూ నా శ్వాస
రైలుపై కప్పు మీద ప్రయాణం చేస్తుంది
మా వూళ్ళో రైలు ఆగగానే
నా ప్రాణం నా దేహంలోకి చేరుతుంది
అక్కడ వేచి చూస్తున్న నా సైకిలెక్కి
తెలిసిన దారులెంత చక్కర్లు కొడుతుంది
సైకిలు గంట విని నా పిల్లలు
నాన్నొచ్చాడు నాన్నొచ్చాడు
అంటూ పరుగెత్తు కొస్తారు
తిరిగొచ్చింది నా మృత దేహమని
వాళ్లకి నేనే భాషలో చెప్పను
వచ్చింది స్వర్గం నుంచా నరకం నుంచా
నేనెక్కడో ఆరెంటి మధ్యా వున్నాను
బావినో కుంటనో మాట్లాడ నివ్వండి
ఒక వేళ నీళ్ళు మాట్లాడానికి నిరాక రిస్తే
నా ప్రాణం ఇంటి ప్రాంగణం లోని
మునగ చెట్టు మీది కాకిలా  మారి
వాళ్లకు నిజం చెప్పేస్తుంది

*******

ఈ కాలం –కీ .శే. మంగలేష్ డబ్రాల్

కంటి చూపు కరువైన వాళ్ళు
తమ దారిని ఏర్పరుచు కోలేరు
అంగ వైకల్యం వున్న వాళ్ళు
ఎక్కడికీ చేరుకోలేరు
బధిరులు
జీవితపు ప్రతిధ్వనుల్ని వినలేరు
ఇల్లు లేని వాళ్ళు
తమ ఇంటిని నిర్మించుకోలేరు
పిచ్చి వాళ్ళు
తమకేం కావాలో తెల్సుకోలేరు
ఇవ్వాల్టి కాలంలో
ఎవరయినా గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, 
చెవిటి వాళ్ళు, ఇల్లులేని వాళ్ళుగా
మారి పోవచ్చు

******

చివరిగా ఓ హైకూ

The invisible crown
Makes everything
Vacant

- BAN’YA NATSUISHI (JAPANESE POET)

ఈ అనువాదాలు కేవలం మచ్చుకు మాత్రమే.  ఎన్నో దేశాల నుండి ఎంతో మంది రాసిన ఎంతో  మంచి కవితలు  ఈ సంకలనం నిండా వున్నాయి.  తప్పకుండా చదివి భధ్రపరుచుకోవాల్సిన  సంకలనమిది.   సంపాదకులకు మరోసారి   ధన్యవాదాలు.

*****

తెలుగులో కూడా కరోనా నేపధ్యంలో అనేక మంది  కవులు వీటికి దీటయిన గొప్ప కవితలు రాసారు.  కాని ఇంగ్లీషులోకి, ఇతర భాషలలోకి  వెళ్ళక  పోవడంతో ఆకవితల రీచ్ పరిమితమయి పోయింది. నిజానికి అది గొప్ప విషాదమే. 

- వారాల ఆనంద్

Follow Us:
Download App:
  • android
  • ios