Asianet News TeluguAsianet News Telugu

వారాల ఆనంద్ కవిత :  నా కన్నీ గుర్తే..

మంచీ చెడూ -  గెలుపూ ఓటమీ మనసు పొరల్లో మరుగున పడడమే లేదు ' నా కన్నీ గుర్తే.. ' అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత  ' నా కన్నీ గుర్తే.. ' ఇక్కడ చదవండి : 

varala anand poems poetry KRJ
Author
First Published Mar 18, 2024, 11:45 PM IST

వరమో శాపమో ఎందుకోమరి
నాకన్నీ గుర్తుంటాయి
అలలు అలలుగా లోనెక్కడో ప్రవహిస్తాయి
సుళ్ళు తిరుగుతాయి
ఉప్పొంగుతాయి సల్లబడతాయి

సుఖాలూ దుఃఖాలూ
అభినందనలూ అవమానాలూ
ఆదరణ నిరాదరణ
అన్నీ అన్నీ మెదుళ్తూనే వుంటాయి
మనసులో మెసుళ్తూనే వుంటాయి

నిజమే మరి
నేనేమీ పిల్లాడి చేతిలో
‘పలక’ను కాను
అ..ఆ.. లు దిద్ది
పాత బట్టతో తుడిచేస్తే మలిగి పోవడానికి

మరుపు ఒక వరం కదా అన్నారెవరో
జ్ఞాపకం ఒక శిక్ష అని కూడా అన్నారు
కానీ ,
వర్షానికి చెత్తా చెదారం కొట్టుకు పోయినట్టు    
కాలప్రవాహానికి ఏదీ చెరిగిపోవడం లేదు
కనీసం
ధారగా పారే కన్నీళ్ళకీ కరగడం లేదు
శిలలమీద చెక్కిన పురా రాతల్లా
నిలబడే వుంటున్నాయి
అవును మంచీ చెడూ
గెలుపూ ఓటమీ
మనసు పొరల్లో మరుగున పడడమే లేదు
నాకన్నీ గుర్తే వుంటున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios