కవితైనా, మనిషైనా అర్థవంతం కావడంలోనే సార్థకత అంటూ కరీంనగర్ నుండి వారాల ఆనంద్ రాసిన కవిత 'సార్థకత' ఇక్కడ చదవండి : 

బతుకు 
ఆరంభానికీ ముగింపునకూ నడుమ 
అలసటెరుగని సుదీర్ఘ ప్రయాణం 

లోకం రహదారి మీద 
నడకో, పరుగో 
విసుగో విరామమో 
జనమో నిర్జనమో 
ఎడారో మహా సముద్రమో 
మనుగడ అనివార్యం 
పయనం నిరంతరం 
... 
రాయడానికి కూర్చున్న 
కవితలో 
అక్షరాలూ అర్థాలూ 
కామాలూ విరామాలూ 

మాటకూ మాటకూ మధ్య 
పారదర్శక భావాలు 
వ్యక్థావ్యక్తాలూ అదృశ్యరూపాలూ 
ఏదో ఒక భాషలో రాత అనివార్యం 
ఏదో ఒక రూపంలో కవిత అవశ్యం 
... 
ఏది ఎట్లున్నా 
రాయాల్సిన కవిత 
ఎక్కడో ఒక చోట 
ముగియనే ముగుస్తుంది 

కాలం గడపాల్సిన మనిషి ఊపిరి 
ఏదో ఓ క్షణం నిలుస్తుంది 
...
కవితయినా మనిషయినా 
అర్థవంతం కావడంలోనే 
సార్థకత