Asianet News TeluguAsianet News Telugu

వారాల ఆనంద్ కవిత : నాలుగు ద్వారాలు

బతుకు నాలుగు గోడల చౌరాస్తా అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత  ' నాలుగు ద్వారాలు ' ఇక్కడ చదవండి : 

Varala Anand Poem - bsb - opk
Author
First Published Nov 1, 2023, 2:28 PM IST

నేనో చతురస్రం 
నా లోపల నాలుగు గోడలు 
గొడగొడకో మూసిన తలుపు 

ఓ తలుపు తెరిస్తే 
గతంలోకి దారి తీస్తుంది 
బారులు తీరిన జ్ఞాపకాలు 
సంతోష తరంగాలు విషాదపు ఉప్పెనలు 
అన్నీ ఉతికి పిండి ఆరేస్తాయి 

అప్పుడప్పుడూ నేను ఆ తలుపు తెరిచి  
అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను 

రెండో తలుపు 
భవిష్యత్తులోకి దారి తీస్తుంది 
అంతా స్పష్టాస్పష్టం 
కాలం తన వెంట తోసుకెళ్తుంది
 
ఆ తలుపు తెరిచే వుంటుంది 
అలసట ఎరుగని పాదాలు 
ఆ దారెంట నడుస్తూనే వుంటాయి 

మూడో తలుపు 
నాలోకి నా లోతుల్లోకి దారితీస్తుంది 
అక్కడున్న పెద్ద అద్దంలో నాకు నేనే కనిపిస్తాను 

అద్దం అబద్దం చెప్పదు 
అబద్దం చెప్పడం దానికింకా ఎవరూ నేర్పలేదు 
అందులో నన్ను నేను చూసుకుంటాను 
పొరలు పొరలుగా ముఖం మీది 
ముసుగులన్నీ తొలగి నగ్నంగా 
ఉన్నదున్నట్టు నాకు నేను దర్శనమిస్తాను 
నాలోని చీకటీ వెలుగూ తెరలు తెరలుగా ముందుకొస్తాయి
 
ఒంటరితనం ఆవహించినప్పుడూ దుఖం కమ్మేసినప్పుడూ 
మౌనంగా ఆ తలులోంచి అలా వెళ్ళి 
నన్ను నేను పుటం బెట్టుకుని ఇలా తిరిగి వస్తాను 

ఇక నాలుగో తలుపు తెరిస్తే 
ఎటు దారితీస్తుందో ఏమి వినిపిస్తుందో ఏమి కనిపిస్తుందో తెలీదు
 
స్తబ్దమయ లోకం లోకి దారితీస్తుందా 
కాలమే తెలీని స్థబ్దతలోకి తీసుకెళ్తుందో తెలీదు 
నేనెప్పుడూ ఆ తలుపు తెరవలేదు 
తెరిచే ప్రయత్నమూ చేయలేదు 
ఏమయినా ఎప్పటికయినా  
ఆ తలుపు తెరవాల్సిందే 
ఆ దారిగుండా వెళ్ళాల్సిందే 
బతుకు నాలుగు గోడల చౌరాస్తా మరి

Follow Us:
Download App:
  • android
  • ios