వారాల ఆనంద్ కవిత : మౌనంగానే
దుఃఖం మనిషి అంతర్యాతన రోదన ఓ బహిరంగ ప్రదర్శన అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత ' మౌనంగానే ' ఇక్కడ చదవండి :
ఎవరయినా ఒక మనిషి చనిపోతే
కళ్ళు చెమ్మగిల్లుతాయి
మౌనంగానే
ఆ మనిషి తెలిసినవాడో
దగ్గరి వాడో అయితే
కళ్ళతో పాటు గుండెలూ
ద్రవిస్తాయి గోడు గోడు మంటాయి
మౌనంగానే
పోయినవాడు మనుషుల్లో తిరిగినవాడయితే
అక్కున చేర్చుకున్న వాడయితే
కదిలించినవాడయితే
కళ్ళూ గుండెలే కాదు
దేహంలోని అణువణువూ
గుండెల్లోంచి ఎగిసే ప్రతి రక్తం చుక్కా
బోరు బోరున ఏడుస్తాయి
మౌనంగానే
చీకట్లో ఒంటరిగా కూర్చుని
దుఃఖాన్నీ జ్ఞాపకాల్నీ
హృదయం మిక్సీలో వేసి
ఎప్పటికోగాని బయటపడలేడు
మౌనంగానే
ఊపిరి కోల్పోయి అచేతనుడయిన
వాడి దేహానికి ఎవడు పాడె కడితే ఏంది
ఎవడు మోస్తే ఏముంది
గాల్లో పేలిన తుపాకులు
ఎవరిని సముదాయిస్తాయి
పాత ఫోటోలు.. కవితలు..
పాటలు.. ప్రకటనలు
బతికున్నవాడి ఉనికినే చాటుతాయి
పోయినోడు ఎట్లాగూ వెళ్ళిపోయాడు
మౌనంగానే
దుఃఖం మనిషి అంతర్యాతన
రోదన ఓ బహిరంగ ప్రదర్శన