Asianet News TeluguAsianet News Telugu

అందుకున్నాను: తహ్జీబ్ కా బాద్ షాహ్ దిలీప్ కుమార్

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం  పి.జ్యోతి రాసిన  “తహ్జీబ్ కా బాద్ షాహ్ దిలీప్ కుమార్” అందిస్తున్నారు వారాల ఆనంద్.

Varala Anand on Tefzeeb ka badshah Dillep Kumar
Author
Hyderabad, First Published Jan 17, 2022, 2:02 PM IST

కస్తూరి మురళీ కృష్ణ గారి సంపాదకత్వం లో వస్తున్న ‘సంచిక’ ఆలైన్ పత్రికలో పి.జ్యోతి గారు రాసిన దిలీప్ కుమార్ వ్యాసాలు అప్పుడప్పుడూ చదువుతూ వచ్చాను. ఇంతలో ఒకరోజు మిత్రుడు నిజాం వెంకటేశం గారు కాల్ చేసి నీ అడ్రస్ కావాలి పి.జ్యోతి రాసిన  ‘తహ్జీబ్  కా బాద్ షాహ్ దిలీప్ కుమార్’ (సినిమాలు సమగ్ర పరిచయం) పుస్తకం పంపపించే ఏర్పాటు చేస్తాను అన్నారు.  ఇంకా బి.నరసింగ రావు తదితరుల చిరునామాలూ అడిగారు. వారం లోపే జ్యోతి గారి దగ్గరి నుండి పుస్తకాన్ని అందుకున్నాను. 380 పేజీలతో, బొమ్మలు మంచి బైండింగ్తో సావనీర్ లావుంది పుస్తకం. వంశీ ఆర్ట్ థియేటర్ వాళ్ళు ప్రచురించారు. భారీగా దిలీప్ కుమార్ లానే వుంది. చాలా మంచి ప్రయత్నం. మొదట జ్యోతి గారికి అభినందనలు.

దిలీప్ కుమార్ అనగానే నాకయితే తలత్ మహమూద్, మధుబాలలు కూడా గుర్తొస్తారు. చిత్రంగా చిన్నప్పుడే నేను దిలీప్ కుమార్ ను వింటూ ఎదిగాను. అప్పుడు కరీంనగర్ లో మూడే సినిమా హాళ్ళు ఉండేవి. హిందీ సినిమాలు తక్కువ. అందులో దిలీప్ సినిమాలు ఎప్పుడో వచ్చేవి. నాకేమో నెలకి ఒకే సినిమాకు అనుమతి వుండేది అందుకే దిలీప్ ని వింటూ ఎదిగాను. తర్వాతి కాలంలో చాలా చూసాను. నాన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా చూసేవాడు. ఆ రోజుల్లో మా నాన్నబాగా పాటలు పాడేవారు. తనకు దిలీప్ అన్నా తలత్ మహమూద్ అన్నా ప్రాణం. ఇంట్లో గొంతెత్తి నాన్న పాడుతూ వుంటే అర్థం తెలిసేది కాదు కానీ ఆ పాటల్లో వున్న మాధుర్యం, వేదన ఎంతో ఆకర్శించేది. క్రమంగా నాన్నను అడిగి కొంచెం కొంచెం అర్థాలు తెలుసుకోవడం ఆరంభించాను. నాకు బాగా గుర్తు ఒక సారి నాన్నను అడిగాను నేనీ పాటలు పాడాలంటే అన్ని అర్థాలు తెలవాల్నా అని దానికి ఆయన నవ్వి ‘ భాష తెలీకుండా భావం ఎట్లా పలుకుతుందిరా పిచ్చోడా’... అన్నాడు. అందుకే నేను సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ తీసుకున్నాను. అంతగా ప్రభావం చూపావా పాటలు.

“ శ్యామే ఘం కీ కసం...
దిల్ పరేషాన్ హై
రాత్ వీరాన్ హై “... అంటూ సాగే ‘ఫుట్ పాత్’ పాట ఇప్పటికీ మనసును బరువెక్కిస్తుంది.

అంతే కాదు “దాగ్” లో
‘హం దర్ద్ కా మారోంకా...’  కానీ
‘ఏ మేరె దిల్ కహీ ఔర్ చల్ ...” వింటూ ఉంటే తర్వాతి కాలంలో దిలీప్ ని చూస్తూ వుంటే ఎంత గొప్పగావుండేది.

‘బాబుల్’ లో   
“మిల్ తే హీ ఆంఖే...

.. అఫ్సానా మేరా బన్ గయా
..అఫ్సానా కిసీకా...” వింటూనో చూస్తూనో వుంటే ఎంత ప్రేమాత్మకంగా వుంటుందో...రెండు హృదయాల ప్రేమ ఎంత హృద్యంగా వుంటుందో ఈ పాటలో దిలీప్ శంషాద్ బేగంలు  ఆవిష్కరించారు.

అంతెందుకు “ సంగే దిల్” లోని
“యె హవా యె రాత్ యె రాత్ యె చాందినీ

తేరి ఎక్ అదా పే నిసార్ హై.. “  ఇట్లా ఎన్ని పాటలు ఎన్ని సినిమాలు. ఒక్క తలత్ మహామూద్ మాత్రమే కాదు ముకేష్ తో సహా ఎంతో మంది గాయకుల పాటలకు దిలీప్ అందించిన హావ భావాలు ప్రత్యేక మయినవి, విలక్షణ మయినవి.


దిలీప్ కుమార్ నటన గురించి మాట్లాడుకుంటే ఆ కాలంలో దిలీప్ కు సమాంతరంగా గ్రెగరీ పేక్ దారిలో వుండే దేవ్ ఆనంద్, చార్లీ చాప్లిన్ ను కొంత అనుసరించిన రాజ్ కపూర్ లు విజయ పరంపరలను కొనసాగిస్తూ వుండేవారు. కానీ దిలీప్ ఎవరినీ అనుకరించకుండా చివరికి యూసుఫ్ ఖాన్ అంటే తనని తాను కూడా అనుకరించకుండా ఒక ప్రత్యేక ఒరవడిని ఏర్పరిచే ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ముఖ్యంగా విషాద పాత్ర ల్లో దిలీప్ ది ఒక ముద్ర. ఎంతగా అంటే ‘బాబీ’ సినిమా రూపొందిస్తున్నప్పుడు కొడుకు రిషి కపూర్ విషాదం ప్రకటించలేక ఇబ్బంది పడుతున్నప్పుడు రాజ్ కపూర్ “ పోరా పోయి యూసుఫ్(దిలీప్) సినిమాలు చూసి రాపో.. విషాదం ఎట్లా ప్రకటించాలో తెలుస్తుంది” అన్నాడంట. అదీ దిలీప్ నటన. అట్లని కేవలం విషాదానికే పరిమితం కాకుండా హాస్య పాత్రలతో సహా వివిధ పాత్రలూ చేసాడు.
అంత విలక్షణమయిన విజయవంతమయిన నటుడి సినిమాల సమగ్ర పరిచయం చేసే పనికి పూనుకోనడమే పెద్ద విషయం. దాదాపు దిలీప్ అన్ని సినిమాల కథలు వివరంగా చెబుతూనే కొంత విశ్లేషణ చేసారు జ్యోతి. తను ఎంచుకున్న పద్దతిలో భాగంగా ఫిలిం ఫేర్ అవార్డులందుకున్న సినిమాలు, నామినేషన్ పొందినవి, సుఖాంతమయిన ప్రేమ కథలు, అవార్డులకు నోచుకోని ట్రాజేడీలు ఇట్లా విభజించి చెబుతూ చివరగా ‘మొఘల్ ఎ ఆజం’ గురించి వివరించారు.   

పుస్తకంలో ఆయా సినిమాల స్టిల్స్ వేయడం సమంజసంగా వుంది. పుస్తకంలో మొదట భారత దేశపు మొదటి మెథడ్ ఆక్టర్ దిలీప్ కుమార్ అని ఆయన నటన పట్ల కొంత విశ్లేషణ చేసారు. నటులు ‘ART OF EXPRESSION’ ఎంత కష్టపడాలో సూచన ప్రాయంగా ఉటంకించారు. నా అభిప్రాయంలో నటులు కేవలం శారీరక హావ బావాలే కాకుండా మానసికంగా ఆయా పాత్రలని ఆవాహన చేసుకుని నటించే విధానాన్ని దిలీప్ గొప్పగా అనుసరించారు.

‘తహ్జీబ్  కా బాద్ షాహ్ దిలీప్ కుమార్’ (సినిమాలు సమగ్ర పరిచయం) పుస్తకంలో రచయిత్రి పి.జ్యోతి దిలీప్ పైన ఎంతో ప్రేమాభిమానాలతో రాసారు. ఆయన సినిమాల కథలు చెబుతూనే మామూలు సినిమా జర్నలిస్టులకు భిన్నంగా రాసారు. అన్ని సినిమాలూ గొప్పవి అనకుండా విశ్లేషణ చేసారు. అందుకు తనని అభినందించాలి. కానీ అవార్డులూ నామినేషన్ లూ అన్న వరుసలో కాకుండా కాలక్రమంలో దిలీప్ నటనను జీవితాన్ని పరిచయం చేసుంటే బాగుండేది అని నాకనిపించింది. మొత్తం మీద జ్యోతి గారి దిలీప్ పుస్తకం ఆయనకు తెలుగులో ఇచ్చిన  గొప్ప నివాళిగా భావించాలి.

ఇక ‘స్టార్లు ఎక్కువయ్యారు, నటులు లేకుండా పోయారు’ అన్నారు జ్యితి కానీ నసీరుద్దిన్ షా , ఓం పూరి, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దికి లాంటి గొప్ప నటులూ మనకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios