Asianet News TeluguAsianet News Telugu

గాజు రెక్కల తూనీగ : సాంబమూర్తి లండ కవిత్వం

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం  సాంబమూర్తి లండ కవిత్వం  “గాజు రెక్కల తూనీగ ” అందిస్తున్నారు వారాల ఆనంద్.

Varala Anand on Samabamurthy Landa Telugu poetry
Author
Hyderabad, First Published Nov 29, 2021, 12:14 PM IST

గత వారం  సాంబమూర్తి లండ అభిమానంతో పంపిన కవిత్వం “గాజు రెక్కల తూనీగ” అందుకున్నాను. ఇటీవల విస్తృతంగానూ విలక్షనంగానూ రాస్తున్న కొత్త తరం కవుల్లో సాంబమూర్తి ఎన్నదగినిన వారు.

‘జీవితానుభవాలకు
కవిత్వం అనే రెక్కలు తొడిగాను   
అవి
అందమయిన సీతాకోక చిలుకలయ్యాయి..’ అన్న సాంబమూర్తి

‘నేను కలం పట్టాక ఎదో తెలియని తృప్తి’ అని కూడా అన్నారు. అట్లా కవిత్వాన్ని కవిత్వం గానూ సింబాలిక్ గానూ సాంద్రంగానూ రాసిన కవి సాంబమూర్తి అని  ‘గాజు రెక్కల తూనీగ’ చదివితే అర్థమవుతుంది.

ఆయన కవిత్వం అనేక పత్రికల్లో విరివిగా చదివినప్పటికీ ఒకే చోట సంకలంగా చదవడం వల్ల ఆయన కవిత్వ లోతుల్ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. పత్రికల్లో అచ్చయి నాకు నచ్చిన ఆయన కొన్ని కవితల్ని నా ‘అక్షరాల తెర’ టోరి రేడియో కార్యక్రమంలో ప్రసారం చేసాను. ‘వెరీ ప్రామిసింగ్ పోయెట్’ అని అప్పుడే అనిపించింది.

తాను పుట్టి పెరిగిన నేల మీద చెప్పలేనంత అవ్యాజమయిన ప్రేమని కనబరిచే సాంబమూర్తి ‘అమ్మ లాంటి సొంతూరు బాట పట్టాలి’ అంటాడు. కవిత్వాన్ని దిక్సూచిగా చేతబట్టి తన ప్రయాణాన్ని నిర్దుష్టం చేసుకుంటున్నాడు సాంబమూర్తి.


‘గాజు రెక్కల తూనీగ’ లోకి వెళ్తే ఆయన కవిత్వం నిండా కష్టజీవులు, వారు పడే వేదన కష్టాలూ కన్నీళ్ళూ ఆద్యంతం మనకు కనిపిస్తాయి.  అంతే కాదు ఆయన కవిత్వం నిండా వైవిధ్యమూ కనిపిస్తుంది. తన పల్లె గురించే కాదు నగరం గురించీ నగర జీవితం గురించీ రాసాడు.

‘దూరం నుంచి చూస్తే నగరం
అందమయిన ప్రశాంత తీరం
అంతరంగంలో సుడిగుండాల కల్లోలం’ అంటాడు. అంతేగాదు ‘గాజు రెక్కల తూనీగ’ లో

“నగర వీధుల నిండా నిశ్శబ్దం ప్రవహిస్తూ వుంటుంది
నగరపు పొడారిన పెదాల పైనుంచొక
నిర్లిప్త గీతం
సన్నగా రోజూ జారుతూ వుంటుంది
మనిషి మనిషికి ఎదురుపడ్డం
ఇక్కడొక అరుదయిన దృశ్యం...
అంతెత్తున నిలబడ్డ ఆకాశ హర్మ్యాల మధ్య
జీవితం మాత్రం
ఎప్పటికీ గాజు రెక్కల తూనీగే” అన్నాడు సాంబమూర్తి.

అయితే కేవలం నగర జీవితాన్ని మాత్రమే కాదు తన వూరు మారిపోయిన వైనాన్నీ అంతే వేదనగా చెప్పాడు.....

‘ఇప్పుడు ఊరెంతగా మారిపోయింది
అమ్మ చేతి గోరుముద్దలనుండి
“జోమాటో” విదేశీ వంటకంగా మారిపోయింది’
 అంటాడు. అంతేకాదు  

‘ఊర్లో నన్నిప్పుడు పలకరించే వాళ్ళేవరూ లేరు
కళ్ళాపుజల్లి ముగ్గులేసిన వాకిట్లో నిలబడి
చేయి పట్టుకుని గడపలోకి
ప్రేమతో ఆహ్వానించే వాళ్ళసలే లేరు.. ‘ అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. అంటే ప్రపంచీకరణ, మార్కెట్ లు కేవలం నగరాలనే కాదు పల్లెల్నీ ఎంతగా కబలించిందీ సాంబమూర్తి చాలా హృద్యంగా చెబుతారు.

ఇక ఉద్దానంలో పెల్లుబికి ప్రాణాంతకమయి నిత్యం మృత్యు గంటికలు మోగిస్తున్న కిడ్నీ వ్యాధుల పర్యవసానాల గురించి కూడా సాంబమూర్తి వేదనగా ఆర్ద్రంగా రాసాడు..

‘అంతం లేని వేదన’ అన్న కవితలో          

“ఉద్దానంలో ప్రతి గడపలో...
కన్నీళ్లు కాలువలు కడుతుంటాయి
 ప్రతి ఊర్లో ఓ దుఖపు నది పారుతుంటుంది  

తీరని వేదన సముద్రమై
సుడులు తిరుగుతుంటుంది
తీరంలో రోజూ కాకులు పిండాలారగిస్తుంటాయి

అప్పుడప్పుడూ వినిపించే భగవత్గీత శ్లోకాలు
ఇక్కడ ఎప్పుడూ వీధుల్లో
మంద్రంగా వినిపిస్తూనే వుంటుంది....

...

ఈ అంతులేని వేదనకు అంతమెప్పుడో
ఈ మరణ మృదంగం ఆగేదేప్పుడో
ఉద్దానం మళ్ళీ పచ్చగా నవ్వే దెప్పుడో!
ఇట్లా తన చుట్టూ వున్న అనేక అంశాల గురించి రాసిన సాంబ మూర్తి నాన్న గురించీ మంచి కవిత రాసారు.

‘నిత్యం పూసే
ప్రేమపూల ఉద్యానవనపు   
తోటమాలి నాన్న
నా బ్రతుకు బండి కింద
బయటకు కనబడని  పట్టాల జంట నాన్న
నాన్న
నా అందమయిన స్వప్నాల్ని
మోసే కనురెప్ప’ అంటాడు.

అంతేకాదు సాంబమూర్తి లండలో మంచి భావుకుడూ వున్నాడు.  దానికి ఉదాహరణగా ఆయన రాసిన ముసురు కవిత చెప్పొచ్చు

“అమ్మ కనబడక పసిపాప
గుక్క పట్టి ఏడ్చినట్టు
అప్పగింతలప్పుడు
కన్నీరు ఆపుకోలేనట్టు
ఎడతెరిపి లేకుండా
కురుస్తోంది వాన...
ముసురుకు తడిచి
బరువెక్కిన గాలి
అటూ ఇటూ వీయలేక
చెట్ల కొమ్మల మీద నడుం వాల్చింది”

ఇట్లా ఈ గాజు రెక్కల తూనీగలో 46 కవితలున్నాయి. వాటిలో భిన్నమయిన సామాజిక అంశాలనీ, వ్యక్తిగత అనుభూతుల్నీ కవిత్వం చేసారు. అంతే కాదు భిన్నమయిన అనుభవాలకూ,ఆశలకూ నిర్దిష్ట రూపం ఇచ్చే ప్రయత్నం చేసారు.

ఇట్లా గాజు రెక్కల తూనీగతో మంచి కవిత్వాన్ని చదివే అవకాశం కలిగించిన కవి సాంబమూర్తి లండ గారికి కృతజ్ఞతలు చెబుతూ, ఆయన్నించి మరిన్ని మంచి కవితల్ని ఆశిస్తూ...

Follow Us:
Download App:
  • android
  • ios