Asianet News TeluguAsianet News Telugu

అందుకున్నాను: టాగోర్ ని గుల్జార్ ని...కొంచెం కొంచెం

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం  'ది గార్దేనర్' అనువాదం 'GULZAR translates TAGORE'  అందిస్తున్నారు వారాల ఆనంద్.

Varala Anand on Rabindranath tagore anf Gulzar
Author
Hyderabad, First Published Aug 9, 2021, 1:54 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మే నెలలో రవీంద్ర నాథ్ టాగోర్ 160వ జయంతి అందరూ అంతటా జరుపుకున్నారు.  ఆయన సృజననీ, సృజనాత్మక జీవితాన్నిపలు విధాలుగా గుర్తుచేసుకున్నారు.  చాలా సంతోషం కలిగింది. ఉద్వేగంగా అనిపించింది.

నేనేమో టాగోర్ ని గుల్జార్ ని కలిపి చదువుతూ కూర్చున్నాను. ఇంతకు ముందు చదివిందే అయినా మళ్ళీ చదవడం గొప్ప అనుభవమే. “REVISITING ALWAYS REJUNAVATES “. ఒక కవితని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి. ఆ కవి కొత్తగా దర్శనమిస్తాడు. Between the lines ఆ కవి మనతో సరికొత్తగా మాట్లాడతాడు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజన కారుడు మనముందు ఆవిష్కృత మవుతాడు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తాడు. టాగోర్ని మళ్ళీ మళ్ళీ చదవడం సరి కొత్త అనుభవమే. 

చిన్నతనంలో గుల్జార్ ని ఇంట్లో పెద్దలు తమ గారేజ్ లో పడుకోమని ఆదేశించడంతో రోజూ రాత్రిళ్ళు గారేజే తన నివాసంగా చేసుకున్నాడు గుల్జార్. అప్పుడు తను కాలక్షేపం కోసం దగ్గరలో వున్న పుస్తకాలు కిరాయికి ఇచ్చే దుకాణంలో వారానికి ఒక అణాకి రోజుకోపుస్తకం తెచ్చి చదువుతూ ఉండేవాడు. మామూలు అపరాధక పరిశోధన పుస్తకాలు చదువుతూ రోజుకో పుస్తకం అడుగుతూ వుండడంతో ఆ పుస్తకాల షాపతను ఒక అణాకు ఎన్ని పుస్తకాలు చదువుతావు ఇదో ఇది తీసుకెళ్ళు అని అటక మీది నుంచి ఓ పుస్తకం తీసి దుమ్ము దులుపి ఇచ్చాడంట, ఆ రాత్రి ఆ పుస్తకం చదవడంతో తన జీవితమే  మారిపోయింది అంటాడు గుల్జార్.  ఆ పుస్తకమే టాగోర్ ‘గార్డెనర్’.  అది జరిగిన అనేక దశాబ్దాల తర్వాత గుల్జార్ టాగోర్ ని అనువదించి అందించిన పుస్తకమే నేనిప్పుడు అంటున్న ‘ GULZAR translates TAGORE… THE GARDENER” ( బాగ్ బాన్).

సంజీవ్ గోయెన్కా ముందుమాటతో మొదలయ్యే ఈ పుస్తకం కోసం బెంగాలీ తెలిసిన వాడు కనుక గుల్జార్ టాగోర్ మౌలిక రచనల్ని సేకరించి హిందీలోకి అనువదించాడు. అందుకోసం సంచారి ముఖర్జీ సహకరించారు. సంచారి పరిచయ వాక్యాలూ రాసారు. మొత్తంగా పుస్తకం టాగోర్ రాసిన బెంగాలీ మూల కవితలు, టాగోర్ స్వయంగా ఇంగ్లీష్ లోకి చేసిన అనువాదాలు, గుల్జార్ చేసిన హిందీ అనువాదాలతో కలిపి త్రి భాషా సంగమంగా వెలువడింది.

నాకు బెంగాలీ రాదు కాని టాగోర్ ని ఇంగ్లీష్ లో చదివి, తిరిగి హిందీలో గుల్జార్ ద్వారా చదవడంతో మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం ఇట్లా అనేక కోణాల్లో అటు టాగోర్ ని, ఇటు గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశం లభించిది.  REALLY IT’S A GREAT EXPERIENCE.  టాగోర్ ని తిరిగి దర్శించడం అదీ గుల్జార్ అనే ప్రకాశవంతమయిన టార్చ్ లైట్ వెలుగులో చూడడం గొప్ప అనుభవం. టాగోర్ ప్రేమికులు గుల్జార్ అభిమానులు మొత్తంగా కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళంతా చదవాల్సిన పుస్తకమిది.

‘ GULZAR translates TAGORE… THE GARDENER” ( బాగ్ బాన్).

ఓ చిన్న కవిత మీ కోసం

అత్యాశ
       -   రవీంద్ర నాథ్ టాగోర్ – అనువాదం గుల్జార్

దీపం ఎందుకు ఆరి పోయింది
రెండు చేతులూ అడ్డుపెట్టి
వీచే గాలినుంచి రక్షించేదుకు
కొంచెం ఎక్కువే యత్నించా
అందుకే దీపం ఆరిపోయింది

పువ్వెందుకు వాడి పోయింది
ప్రేమతో ఆత్రంగా నా గుండెలకు
గట్టిగా హత్తుకున్నాను
అందుకే పువ్వు వాడిపోయింది

నది ఎందుకు ఎండి పోయింది
ఎప్పటికీ సొంతం చేసుకునేందుకు
ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట వేసాను
అందుకే నది ఎండిపోయింది

 వీణ తీగ ఎందుకు తెగి పోయింది
నేనే శృతి కోసం దాని శక్తికి మించి
లాగానేమో
అందుకే తీగ తెగి పోయింది
                 - స్వేచ్చానువాదం: వారాల ఆనంద్ 

Follow Us:
Download App:
  • android
  • ios