Asianet News TeluguAsianet News Telugu

పుస్తక సమీక్ష: నీళ్లకోసం మైళ్ళు నడిచే కథ

వాసరచెట్ల జయంతి కవితా సంకలనం ' నేలవిమానం' పై వనితారాణి నోముల రాసిన సమీక్ష.

Vanitha rani Nomula reviews Vasarachetla jayanthi poetry collections
Author
Hyderabad, First Published Feb 25, 2021, 12:28 PM IST

నీళ్లకోసం మైళ్ళు నడిచే కథ కలిగిన మహబూబ్ నగర్ బిడ్డ జయంతి వాసరచెట్ల ను  తొలిసారి చూసినప్పుడే తన సౌమ్యత అర్థమైంది.  మనిషి ఎంత సౌమ్యమో, రాతలు కూడా అంతే మృదుత్వమని.తన కవితా సంపుటి నేల విమానం చదువుతున్నప్పుడు ఆ సంపుటి తడి తపనల అక్షర సమాహారమని అనిపించింది.  ఆ తడి నా గుండెను చేరింది.

అలతి పదాలతో , సరళమైన భాషతో, జీవితాన్ని అతి దగ్గరగా చూసిన అనుభవంతో జయంతి  అద్భుతంగా రాసారు.  పెద్దల పర్యవేక్షణలో మెరుగు దిద్దుకున్న తన అక్షరాల సంపుటిలో ఎవర్ని మరవకుండా పరిచయించారు.  సాహిత్య అకాడమీ  పూర్వ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి   ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో జయంతి తడి అక్షరాల తపన కనిపిస్తుంది. 
ఇక కవితల్లోకొస్తే.

ప్రధాన పుస్తక నామ శీర్షిక 'నేల విమానం' అంటే సైకిల్.  చిన్నప్పుడు చేన్లు, చెలుకలకు సైకిల్ మీద పోవడం, పాల క్యాన్లు, పళ్ళ బుట్టల మోతతో ఉపాధినివ్వడం ; అది లేకుండా రోజు గడిచేది కాదని, టైర్లల్ల గాలిపోతే పదిపైసలకు ప్రాణం పోసిన జహంగీర్ ను తలుచుకుంటూ అప్పటి ఆ రెండు చక్రాల కచ్చరం ఇపుడు పురాతన వస్తువై ఎందుకు పనికిరానిదై కొయ్యకు వెళ్లాడుతుందని ఈ కవితలో వాపోతారు.

ఇంకో కవిత 'మా ఇంటి అరుగులు' అంటూ ఆతరం ముచ్చట్లను చెప్తూ, ఎండాకాలం నానమ్మ వచ్చిపోయేవారికి  నీళ్ళు పోస్తూ దూపను తీర్చే విధానాన్ని గుర్తు చేసుకొని  బాల్యపు జ్ఞాపకాలకు ఏతాము వేసిన జయంతి  పుల్ల ఐసుల  చల్లదనాన్ని ఇంకోసారి ఆస్వాదించారు.
 
'పచ్చని పందిరి' కవితలో అత్తారింటికి వెళ్లే ఆడపిల్ల అంతరంగాన్ని, అక్కడ తన అస్తిత్వపు ఆనవాళ్ళకై పడే అంతః సంఘర్షణని కళ్ళకు కట్టారు..
అలాగే  'పడిలేచే కెరటం' అనే కవితలో 
'పడిలేచే కెరటాన్నడుగు/
పడినప్పుడు పడే బాధ చెబుతుంది/
పడినా,లేచే దారి చూపిస్తుంది.
అంటూ జీవనసంద్రంలో ఆటుపోట్లు సహజమేనని, మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవితానికి బాట సుగమం చేసుకోవాలని హితవు పలికారు కవయిత్రి.

దర్జీల కష్టాల గురించి - ఎన్నిమారినా వారి జీవితం మారలేదని, దీపావళి భూచక్రాల మాదిరి మిషన్ చక్రం తిప్పుతూనే ఉంటారని బాధ పడతారు.కవిత్వపు లోతుల్ని కొలవలేమంటూ 'నైపుణ్యాల నగ' గా త్రాసులో మొగ్గుగా చూపెట్టే విలువలున్న కవిత్వాన్ని అందిద్దామని కవులకు పిలుపునిచ్చారు.

'అంటరాని గది' కవితలో అoటరానితనం గురించి, శ్రమ దోపిడీ గురించి  చక్కగా కవిత్వీకరించారు.మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం యువతులకు జరిగే తలాక్ అన్యాయాన్ని 'నఖాబ్' లో ప్రశ్నించారు.ప్రేమ పేరుతో మోసగించబడ్డ యువతి గోడుగా రెండవ ముఖం, కొత్త రెక్కలు, బస్ లో లేడీ కండక్టర్ పడే పాట్లు ఇలాంటి విభిన్న సమస్యల నేపథ్యం తీసుకుని తనదైన శైలిలో సామాజిక దృక్కోణంలో కవితా రచన చేశారు. చక్కని ఆణిముత్యం లాంటి 63 కవితలను ఈ సంపుటిలో మనం చదువుకోవచ్చు.

ప్రేమ, విరహం ఎవరైనా రాయగలరేమో కానీ ఎదుటివారి బాధకు , తమ గుండె తడి కాగలిగినవారు మాత్రమే  రాయగల కవిత్వం 'నేల విమానం' లో  మనకు ఆవిష్కృతమవుతుంది.   దుఃఖoలోంచి ఉబికే లావా లాంటి ఈ కవితల్లో సామాజిక సమస్యలకు పరిష్కారాలను చూడవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios