Asianet News TeluguAsianet News Telugu

వనపట్ల సుబ్బయ్య తెలుగు కవిత: మానవత్వం

లేతపొద్దున సూర్యకిరణాలను స్వీకరించినట్లుగా మనవత్వాన్ని  హత్తుకోవాలి అంటూ వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత 'మానవత్వం'  చదవండి.

Vanapatla Subbiah telugu poem, telugu literature
Author
Wanaparthy, First Published Oct 15, 2020, 1:24 PM IST

మానవత్వం
ఏ మోర్ మార్కెెట్టులనో  బిగ్ బజార్ లనో అమ్మరు
హేతుతత్వం
ఏ యోగాసనాలలో దొరుకదు
నీవు నడిచే తోవలో
నీ ఇంటిచుట్టు పదేపదే నిన్నే వెతుకుతుంటది నీవు పట్టించుకోవుగాని
మనిషంటే దానికి పంచ ప్రాణం

లేతపొద్దున
సూర్యకిరణాలను స్వీకరించినట్లుగా మనవత్వాన్ని  హత్తుకోవాలి
అమ్మ కట్టెలమోపును మోసినట్లు
మానవత్వాన్ని  మోయాలి
మానవత్వం ఏ డీ మార్ట్ లో దొరుకదు
ఎనిమియా వచ్చినప్పుడే
రక్తపు బాటిల్ ను వెతికి
ఆపతైనప్పడు
గుండె తలుపులు గుప్పున మూసుకోవడం గాదు
కండ్లముందెదురైన కల్లోల్లాన్ని కనీసమైనా చూడాలి
ఆవగింజంతన్న  పట్టించుకోవాలి
ఆకలికి అన్నానివి కావాలి
దాహనికి నదివి కావాలి
నీడకు చెట్టువు కావాలి
ఆపతికి ఆత్మబందువు కావాలి
మానవత్వం
ఏ బిగ్ బజారులో కిలోలుగా అమ్మరు
బండరాళ్లను బహు గొప్పగా పూజించి
పక్కనున్న మనిషిని కులంతో వెలేస్తివి
కండ్లముందు ఆకలితో పేదలు అల్లాడినా
సకల పొందులతో  విందులారగిస్తివి
జన్మనిచ్చిన తల్లితండ్రుల్ని అనాదాశ్రమానికి తరలిస్తివి
సత్యాన్ని బొందపెట్టి జ్ఞానాన్ని పాతిపెడ్తివి
మానవత్వం ఏ చైనా మాల్ లో దొరుకదు
ఇప్పడు
మానవత్వమంటే
అందులైన తల్లితండ్రులను కావడిగట్టుకొని మోసిన శ్రవణకుమారుడి త్యాగం కావాలి
మానవత్వమంటే
గాయపడిన పక్షికి ఆకు పసరు కట్టుకట్టి
గాలిలో ఎగురేసిన సిద్ధార్థుని మానవత్వం కావాలి
యజ్ఞగుండాలకడ్డుపడి పశుసంపదను రక్షించిన గౌతమ బుద్ధుడి మానవత్వం కావాలి
అమృత పాయసాన్ని అందించి బుద్ధుని నిలబెట్టిన సుజాత మానవత్వం కావాలి
కరోనా విపత్తులో
డాక్టర్లు, నర్సులు, ప్రాణదాతలై
పారిశుద్ధ్య కార్మికులు,కరెంటు కార్మికులు సామాజిక సైనికులై
జర్నలిస్టులు బాధ్యతా మల్లెలై
రోడ్లు పొడవు దాతృత్వంతో చేయందించిన మహోన్నతుల మానవత్వం కావాలి.
మానవత్వం శీఖరం కావాలి

Follow Us:
Download App:
  • android
  • ios