Asianet News TeluguAsianet News Telugu

వనపట్ల సుబ్బయ్య కవిత : మబ్బునీడల్లో మశమ్మ..!

గొంతుకోసే పాడు అనాచారాల   చెంపలను చెప్పుతో వాయించాలే అంటూ వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత  ' మబ్బునీడల్లో మశమ్మ..! ' ఇక్కడ చదవండి : 

Vanapatla Subbaiah's poem - bsb - opk
Author
First Published Aug 1, 2023, 12:18 PM IST

అయ్యగారు పెట్టిన సుమూర్తంలనే పెండ్లి
నక్కాకు నల్లపూస ఏ దారం పోస మర్చిపోకుండా
లాంచనాలన్నీ వరసపోకుండా ఘనంగా పెళ్లి
ఏడాదికేచంటోడుపుట్టే
సంకన చంటోడొచ్చిసరికి రెండునెల్లకే యాక్సిడెంట్
నెత్తిమీద నీడ జరిగి పాయే
గీ తలరాత రాసిన బ్రహ్మ పరమదుర్మార్గుడు కాదా?
కాలం ఎక్కిరిస్తే బతుకు కూలిన గుడిసాయే !

తల్లిగారిల్లు తలుపులు మూసింది
అత్తగారిల్లు సాపెనలతో మెడపట్టి గెంటేసింది
అన్న ఆదరెవయ్యుండు వదినె చీదరిస్తనేవుంది
దీని కాలుమూర్తంపాడుగానంటూ
కోడెలాంటి బిడ్డ చటుక్కున రాలిపాయే 
మొదనష్టానిదని దరిద్రానిదని నోటి దూల
గెదిమిన కుక్కబతుకై దిక్కుతోచని మేఘమై
ఏచెట్టో చావిడో, ఏ రాయో,గుడో బతుకు దాపాయే!

కాకులు అరిచినా పిట్టలరిచినా దిగ్గున లేస్తది
పిలగాడు అదుర్తడని ఈపుచరిచి
కొంగడ్డం పెట్టకొని దుఃఖాన్ని కళ్ళలోవొత్తిపట్టుతది
అర్దరాత్రి కుక్కలరుపులో మొగడొచ్చిండాని ఉలికిపడి తలుపుతీసి కూలవడె
ఏ పనికి పోయినా ఏవేవో గుసగుసలు 
తోటి ఆడ కూలీలవే!
పెద్దవాళ్ళు పనిలేదని గసిరిస్తరు
అప్పుడే దిగ్గుల్కినావని నిందిస్తరు 
కంటికి నిదురలేదు చేతిల పనిలేదు
పొట్ట బట్ట బతుకుదెరువు
కంప చెట్టు మీద చీరిన పాత బట్ట లాగాయే!

తోటోల్లంతా తయారయి పందిట్లో వొడినింపుతుంటే 
తానేమా పందిరిగుంజపట్టుకొని గుడ్లనిండా నీళ్లుదీసె
అందరి కాళ్లకు పసుపు అలంకరణలు
ఏది ముట్టనీయరు 
ఏడ పాడనీయరు
పసుపుకుంకుమ లేని జీవితమని 
ఇసిరిచ్చి గసిరిచ్చి 
ఈగలాగ తీసేస్తరు
చెరువు కొమ్మున చెట్టు పీకేసిన కాపురమాయే!

చెట్టుమీద దోమల్లా కొందరు
మెట్టెలు లేని కాళ్లనే చూస్తయి
సందట్లో దొంగచూపులు చూచి
కామబాణాలతో పొడుస్తుంటరు
నిలబడనీయరు 
నీళ్లు తాగనీయరు
ఊరికండ్లన్ని దిష్టికత్తులై వెంటాడి వేటాడి తిరుగుతుంటయి !

పెత్తరమాస
పెద్దలకుపెట్టిన పరమాన్నం
కల్లు సాకపోసి సాంబ్రానేసి
ఎంతపనాయె దేవుడాని గోదరిల్లే
అవమానాలెన్నున్నా భర్తపోటోకు దండంపెట్టి 
గుండెనిండా తలుసుకునే గొప్ప మనసు
భూమికి లేని శెరలు బారతమ్మ భరించె
నదికిలేని వంకలు నారమ్మకే సుట్టుకొనే!

అవమానాలు శూలాల్లా పొడుస్తున్నా నాగరికతకోసం 
నలుగురిల తలెత్తుకొని నిజాయితీగా నడుస్తది
తండ్రీలేని లోటును ఎక్కడ రానీయదు 
పెంచిపెద్దజేసి చదువులెల్లదీసె...
ఉన్నత స్థానంలో ఎదిగిన బిడ్డనుచూసి
దుఃఖాన్నంత దుప్పటిగ కప్పుకొని 
లోపటనే కుమిలి పోయి కండ్లు నలిచె
మశమ్మ మారు మనుము పోలేదు 
బిడ్డ పేగును తెంచుకోలేదు !

బిడ్డకు బొట్టుపెట్టనీయరు
కొడుకు పెండ్లిని కళ్లచూడనీయరు 
దూరముండు దూరముండని జరిపే
అత్తమామలు ఆడబిడ్డలు
ఇరుగు పొరుగులు విసపురుగులై పారాడుతున్నా
ఊరిబాధలు ఉరితాళ్లై బందనాలు
గుండె చెదరని దీరత్వం
ఒంటిమామిడిలా వెన్నెల పండై కాసే!

మొగడులేనిదన్నా
ముండమోపిదన్నా బజారుదన్నా రచ్చకెక్కిందన్నా
జడన పూలు లేవన్నా గాజులు లేవన్నా
ఆమె శ్రమ వెన్నెలై పూసింది నడక నెలవంకైంది 
నాగరికత వడ్యానమై మెరిసింది
తోడు జరిగిపోయినా మొండి దైయిర్యంతో
మొక్కవోని తపస్సుతో మొగులెత్తు నిలిచిన మల్లమ్మకు నమస్కరించాలి
ఇంటి ఇగురం సంస్కారాన్ని 
సమాజ బాధ్యతను నిలబెట్టిన పోషమ్మ కాళ్లకు దండం పెట్టాలే !

ఏ చెట్టుమీద ఏ పిడుగెప్పుడో 
ఏ పాము ఎప్పడు నాలుక సాపుతదో 
రోడ్డు మీద ఏ వాహనం యముడై తూలుతడో
ఆకస్మాత్తుగా చేతాడు తెగిన కాపురాలు
భర్తపోయి దేశమంత బాధల్ల కుంగిపోతుంటే
దురాచారాల పేరుతో మరింత దూరముంచి
గొంతుకోసే పాడు అనాచారాలు
మతిలేని కత్తుల మాటలతో ఏరకంగా ఎవరిని హింసించి నిందించినా నిలువునా పాతిపెట్టాలి
చెప్పుతో చెంపలను వాయించాలే
సాలుపొడుగూత కలుపును ఏరేసినట్లు
తీరులేని మనుషులను ఏరవుతలికి తరుమాలే !!!

Follow Us:
Download App:
  • android
  • ios