వనపట్ల సుబ్బయ్య కవిత : కుదెన
కవి మిత్రులు తగుళ్ల గోపాల్ తల్లి "ఎల్లమ్మ " చనిపోయిన దుఖంలో వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత ' కుదెన ' ఇక్కడ చదవండి :
గాలి లేదు
ఏ తుఫానూ రాలేదు
పిడుగు పడినట్లు వాకిట్లో
యాపచెట్టు కూలిపాయె
బండిరుసిరిగిపాయె
అమ్మ ఇల్లిడ్సిపాయె!
బక్కమేక
బిక్కిబిక్కి చూస్తున్నది
మేతేసే చెయ్యిలేక డొక్కలు ఎండుకపోయినవి!
కూలిన కొట్టంకాడ కుక్కపిల్ల కన్నీళ్లు!
కెయ్యదూడకు కుర్తితాపేదెవరు?
కోడికి గింజలు పెట్టేదెవరు ?
దీపంలేనింట్ల అదురుపట్టిన గోడలు!!
అత్తమ్ముంది పెద్దమ్ముంది చిన్నమ్ముంది
మామ, తాత, కక్కయ్య, బావలు బలగమంతున్నది
ఊరిల అందరున్నరు
ఒక్క అమ్మనే లేదు!
తెంపిపోసిన మక్కజొన్న కంకులు
కట్టిన కట్టెల మోపు
సెలుకల అన్నీ ఉన్నవి
ఒక్క అమ్మనే లేదు!
పనికి పోయిన కాడ పొద్దుపోయిందనుకున్నా
నడిమింతల్నే నవ్వు రాలిపాయే!
కూలికి పోయినా
మాట మాట్లాడినా
నలుగుట్ల బొడ్డెమ్మేసినా
నూరుమందిలున్నా
అమ్మదే మొదటి పాట!!
నాయిన సరీత
నాగలితో పాటు నడిచి పొలంలోవిత్తనమైంది!
చీకట్ల చేదబావి మీద చేతాడైంది !
మూలకు పొయ్యిమీద
రొట్టెకొడుతున్న దరువు ఆగిపోలేదు!
నిద్రకళ్లు నలిచిన సూర్యుడు
ఏరెండిపోయినట్లు చేనెండిపోయినట్లు
గోడల స్తంభం గోడలనే విరిగినట్లు
అమ్మ ఆయుశు తీరకముందే
అలా వెళ్ళిపోయింది?
మూసుకున్న కనురెప్పలు ఎంతమొత్తుకున్నా
ఎంతపిల్చినా పలుకదు
ఏ సందులా కానరాదు!
అమ్మ
నన్ను సదివిచ్చింది
బడి కాడికి సద్దితెచ్చింది
నా చుట్టే కావలున్నది
నేనింత కావడానికి
అమ్మ ధైర్యమే నడిపిచ్చింది!!
పల్లె పిల్లగాన్ని
ఢిల్లీ పిలిచినప్పుడు అమ్మ పసిపిల్ల అయింది
ఆరోజు అమ్మ ఆనందం భరించలేక
నవ్వులు మోయలేక అలసిపోయింది!
నా సుఖం కోసం తపన పడి కరిగిపోయిన గుండె అమ్మది !
నాయన పోయినా
అమ్ముంటే ఆకాశమే నాదనుకుంటిని !
అమ్మ వెళ్ళిపోతుందన్న ఊహే లేదు!
కానీ అమ్మ వెళ్ళిపోయింది!
అమ్మలేనితనం ఇప్పుడు నాకు తీరని కుదెన!
అమ్మ మళ్లీ వచ్చేవరకు ఎదురుచూస్తూ....
తమ్ముడు గోపాల్
అమ్మ తలుపుల వొలపోత
అమ్మల దూరం చేసుకున్న మాకు
మా అమ్మ యాదికొచ్చింది !
ఏడుపే తప్ప వర్ణించలేని అమ్మకథ!
రంపపుకోత గొడ్డలికాటులా
ఎంతవేదన ఎంత బాధ
మేమిద్దరం చిన్నతనంల
అమ్మను పోగొట్టుకున్న అనాధలం!
మానుకొట్టేసిన కొమ్మలం
అమ్మ లేని బిడ్డలం!!!