Asianet News TeluguAsianet News Telugu

కవిత్వ చెలిమె వనపట్లసుబ్బయ్య

జీవితంలో కష్టాల కడగండ్లను లెక్క చేయక కవితల చిరునవ్వుతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న వనపట్ల సుబ్బయ్య రాష్ట్ర మంత్రులు,నాయకులు, మేధావులు, అధికారులు, కవులు ,రచయితల ప్రశంసలు పొందినా...ఎక్కడా తొణకకుండా తన కవితాదారిలో కొనసాగుతూనే ఉన్నడు.

Vanapatla Subbaiah on winning mallavajjula Sadasiv award
Author
Hyderabad, First Published Nov 20, 2021, 8:57 AM IST

 

తెలంగాణ వికాస సమితి, చేతనా సాహితీ సమాఖ్య సంయుక్తంగా గోదావరి గొంతుక మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం - 2021  ని  ఆదివారం 21 నవంబర్ 2021 న అందచేస్తున్న  శుభసందర్భంగా  ఆమ్ గోత్. వెంకట్ పవార్ రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

'కవిత్వ చెలిమె వనపట్లసుబ్బయ్య'
     

వనపట్ల సుబ్బయ్యది బహుజన ప్రజావాదం, తెలంగాణ ప్రజా కవిత్వం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓ కెరటంలా ఎగిసిపడి సకలజనుల సమ్మెలో 'వొల్లెడ'లాంటి దీర్ఘ కవితతో మొదటగా తన గొంతుకనందించిండు. నిత్యం నెగడులా మండిన తెలంగాణ ఉద్యమంలో  'మశాల్' అనే మహోద్యమ దీర్ఘ కావ్యాన్ని అందించిండు.  వలసపాలనలో నెర్రెలిచ్చిన పాలమూరు నేలన కృష్ణాజలాలు ప్రవహించాలని ,విద్యార్థి దశలోనే జలసాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సోయి ఉండడం వలననే 'ఊరచెరువు' 'తడి' లాంటి జలదృశ్య దీర్ఘకావ్యాలు రాయగలిగిండు. సామాజిక అస్తిత్వ స్పృహను రగిలించడానికి 'కుర్చీ' కవిత్వాన్ని వెలువరించిండు. 'తెలంగాణ జాతిపిత జయశంకర్ సర్ పై "జనశంకరుడు'', తెలంగాణ భాషా సౌందర్యాన్ని వర్ణిస్తూ 'తెలంగాణ తేనెపలుకు'లాంటి దీర్ఘ కవితల ద్వారా భావగర్భిత స్వరాష్ట్ర ఆకాంక్షలను అక్షరబద్దం చేస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అదే భూమికను పోషిస్తున్నడు.  అలాగే కరోనా కాలాన్ని పూర్తిగా రికార్డు చేసిన 'సెల్ఫ్ లాక్ డౌన్' లాంటి కావ్యరచన ద్వారా సమకాలీన అంశాలను ,చరిత్రను అక్షరబద్దం చేస్తున్నడు. 

వృత్తి క్షౌరవృత్తి ,  ప్రవృత్తి కవిత్వం సబ్బండ కులాలకు 'మంగలి' మంగళప్రదమైనట్లే సబ్బండ కులాల గోసను తన కలంతో కవితలల్లి ప్రపంచానికి చాటుతున్నడు. గిజిగాడు గూడల్లినట్లు అతని చేతులు అందమైన పదాలతో కవితలుగా మలిచి అనేక వస్తువులకు జీవం పోస్తయి. చేతిలోని కత్తెర్లు, దువ్వెనలు సైతం కవితలల్లుతయంటే మనం ఆశ్చర్య పోనక్కరలేదు. చెలిమె ఊటలా పదాలు అతని పెదాలపై నుండి ఉబికి వస్తయి. అతనో కవితల జీవధార. నిత్యచలనశీలి. తను ఏమాట మాట్లాడిన, ఏ పని చేస్తున్నా అందులో కవిత్వాన్ని వెతుక్కుంటడు. కవిత్వంలో తనో తత్వవేత్తలా...కనిపించే ఏ చిత్రాన్నైనా, సంధర్భాన్నైనా,అక్షరాన్నైనా కవిత్వీకరించకుండా ఉండలేడు. తన కవిత్వంలో తెలంగాణ ప్రజల భాష,యాస ప్రతీ అక్షరంలో కనిపిస్తుంది. అతను ఎంత సృజనశీలో కవిత్వం అంతకన్నా సృజనాత్మకంగా పురుడు పోసుకుంటది.
పుట్టిన ఊరినే కలం పేరుగా మార్చుకుని తనతోపాటు ఊరును రాష్ట్రానికి పరిచయం చేసిండు. పుట్టినందుకు 'వనపట్ల' గ్రామం ప్రతిరోజూ తలెత్తుకుని గర్వపడుతుంది. చెదిరిన జుట్టు, మాసిన బట్టలు,అరిగిన చెప్పులు, చిరిగిన బ్యాగు ఇది అతని దైనందిన ఆహార్యం. కనపడిన ప్రతి ఒక్కరిని చిన్నా, పెద్దా తేడాలేకుండా చిరునవ్వుతో పలకరిస్తూ, కరచాలనంతో కలిసిపోతడు. అతని ఆలోచనలను కవితల రూపంలో ఆవిష్కరించే పద్ధతి చాలా భిన్నమైనది , నూతనమైనది.
వందల మంది మధ్యలో నడుస్తూ, మాట్లాడుతూ, బస్సులో ప్రయాణిస్తూ ప్రతిక్షణం అక్షరాలను చెక్కె నిత్య శిల్పి అతడు. కాన్పు కోసం తండ్లాడే తల్లిలా రాత్రిళ్ళు అతను మంత్రసాని లేకుండా ఒంటరిగా అక్షరాలను కంటూనే ఉంటడు. అతని నడకలను అందుకోవాలంటే మనం పరుగెత్తాల్సి ఉంటుంది. కవితలు కూడా అంతే...!

తెలవారుజామున్నే నిద్రలేసి పరుగు పరుగున బస్టాండ్ కొచ్చి దినపత్రికలను బండిల్ చేసి తీసుకొచ్చే ఖాళీ వైట్ పేపర్లను వెతుక్కొని కవితలు రాసుకోవడానికి వాడుకుంటడు. అతని దృష్టిలో ఉపయోగంలేని వస్తువంటూ ఏదీలేదు. మనం వాడుకోగలిగితే అన్నీ ఉపయోగపడతయి అంటాడతడు. అతని చేతివేళ్ళు అనుక్షణం కవితల వర్షాలను కురిపిస్తుంటయి. వాటిని చదివినవారు ఆ కవితల వానలో తడిసి ముద్దయిపోతరు. 'నాగస్వరం ఊదితే నాగుపాము నాట్యమాడినట్లు ' అతని మెదడు ఇచ్చే ఆదేశాలను ఆచరించడం తప్పా చేతివేళ్ళు ఇంకేం చేయగలవు..?

అతనిది ఉంగురాలజుట్టు తలపై వెంట్రుకలెన్నున్నవో..! మెదడు లోపల అంతకు మించి కోటానుకోట్ల అక్షరాలపుట్ట దాగున్నది. చేతికి కూడా అన్ని పనులుంటయి. కానీ ఏవి ఇంట్లోకి నాలుగు గింజలు తెచ్చేవి కావు. రాసిన కవిత్వం వడ్లకుప్పలాగా రాసులు పడుతుంటే పేదరికపు చాయలను దరిచేరనీయకుండా కన్నమ్మ కష్టాలుపడి అతికష్టమ్మీద ఓ పుస్తకం అచ్చేసుకుని మురిసిపోతడు. ఓర్పు, సహనం, అనే పదాలు మనం పుస్తకాల్లో చదువుకున్నం కానీ..!  వనపట్ల సుబ్బయ్యను చూస్తే ప్రత్యక్షంగా వాటిని చూసినట్లే..!.గర్వం, పొగరు, కోపం, ద్వేషంలాంటి పదాలకు తన వ్యక్తిగత జీవితంలో చోటులేదు.   అతని నవ్వు పసిపిల్లల నవ్వుల్లా ఏ కల్మషం లేని చిరునవ్వు.  అందుకే పసిపిల్లాడి నుండి మహాపండితుడి వరకు తనకు దోస్తులున్నరు.  అది అందరికీ సాధ్యం కాదు.  అతను సాదాసీదా కవి. సాహితీవేత్తలవే కావు, సామాన్యుల పనులను సైతం తనవనే భుజాలపై వేసుకుని మోసి సాధించి విజయతీరాలకు చేర్చే పరోపకారి, కార్యసాధకుడు. అతను స్పృషించని అంశం, కవిత రాయని సాహితీవైతాళికులు లేరు. ఒక్కసారి అతను సాహితీవేత్తలపై కవిత రాసిండంటే ఆ కవిత ఖచ్చితంగా ఫ్రేముగా మారి ఇంటి గోడలపై నిలిచిపోతుంది. అంతగా సాహితీవేత్తలను చదివేస్తడు.  కవిత్వంలో అనేక వాదాలున్నయి, రంగులున్నయి.  ఏ వాదం,రంగుల్ని అంటించుకోకుండ అన్ని వాదాలు తనవే అంటూ వాటిలోకి ప్రవేశించి కవితలు రాయగల దిట్ట.

అద్దెకుంటున్న చిన్న ఇంటి నిండా పుస్తకాలు నిండి పక్కింట్లోకి కూడా చేరుకున్నయంటే పుస్తకాలపై, సాహిత్యంపై అతనికున్న మక్కువ ఇట్టే తెలుస్తుంది. పీజీ స్థాయి ఉన్నత విద్యనభ్యసించినా తన కుటుంబ పరిస్థితుల కారణంగా ఏ దరిని అందుకోలేకపోయిండు. పేదరికపు దుఃఖాన్ని గుండెనిండా నింపుకున్నా ఏనాడు ఆ ఛాయల్ని తన ముఖంపై కనపడనీయక నిత్యం చిరునవ్వు అస్త్రాన్ని ప్రయోగిస్తడు.
                
హైదరాబాద్ లో సాహిత్య మీటింగ్ కు పోయి వచ్చిండంటే అందరికీ ఫోన్ కాల్ చేస్తడు. రెక్కలు కట్టుకుని అక్కడికి వాలగానే తలా ఓ పుస్తకమిస్తడు. పుస్తకాలు పదిమందికి అందించి వారిచేత కూడా ఏదో ఒకటి రాయించాలన్న తపన తనది. నిత్యం కవితలను రాస్తూనే  నూతన కవులు, రచయితలలో ఉన్న ప్రతిభను గుర్తించి 'పలానా కవిత నీవు రాస్తే బాగుంటుంది. పలానా విషయం నీవు డాక్యుమెంట్ చేయాలి.' అంటూ అన్ని విషయాలు అందరికీ పంచి తనకేమీ తెలవదన్నట్లు దూరంగా నిలబడిపోయే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.

రోజంతా అలసిన పానాన్ని ఒక కప్పు చాయ్ తో ఉత్తేజం పొంది ముందుకు దూసుకెళ్ళగల పదునైన కవి అతను. చక్రంలా గిర్రున తిరుగుతున్న కాలంతో పోటీపడి కవితలు రాస్తూ దూసుకుపోతడు. రాత్రిళ్లు కోడినిద్రలా కునుకు తీసి చటుక్కున మెలకువ రాగానే మెరుపులా కొత్త కవిత్వమైతడు.  అతని కళ్ళు ఎక్స్ రే కన్నా వేగంగా మనుషుల శరీరంలోకి దూసుకెళ్లి వారి అంతరంగాన్ని అక్షరాలతో ఆవిష్కరిస్తయి.  మిత్రులు రాసిన కవితలు,పుస్తకాలు 'ఓసారి చూసి సరి చెయ్యండి' అంటే చాలు జేబులోనున్న కళ్ళద్దాలు చెవులకెక్కుతయి. చేతిలోని పెన్ను చకచకా అక్షరాల్ని కత్తిరించి ఒక్కోఅక్షరం ఒక్కో సందులో ఒక్కోవాక్యం ఒక్కో వరుసలో అలా ఒంపి అందంగా అదనపు సొగసులద్ది ముస్తాబు చేసి మనచేతికి అందించే ఎడిటర్ సుబ్బయ్య.  తనపై ఎవరెన్ని రాళ్ళు విసిరినా చిరునవ్వు నవ్వి వాటిని కూడా కవితలుగా అల్లుకొని , కవిత్వంలో వాడుకుని నవ్వుకుంటడు.

తను తినే కంచంలో ఒక్క మెతుకు కూడా వృధా కానీయడంటే అతనికి అన్నం విలువ, ఆకలి, పేదరికం విలువ తెలుసు. ఇంతవరకు సొంతిల్లు ,సేద్యం చేయడానికి గుంట భూమి కూడా లేదు. అందుకే నేడు వలసల జిల్లా పాలమూరులోని చెరువులు మండువేసవిలో సైతం అలుగెల్లుతుంటే తను మాత్రం కవితల సేద్యం చేస్తూనే ఉన్నడు.  రెండో పంట పండిన రైతుల కళ్ళలోని ఆనందాల్ని అక్షరాలుగా మలుస్తనే ఉన్నడు.

ఆచరణాత్మక కవిత్వం రాసుకుంటూ  బహుజన కవిగా తెలుగునేలలో గుర్తింపు తెచ్చుకున్నడు.  ఒక అంశాన్నిచ్చి అతితక్కువ సమయంలో కవితనో, దీర్ఘ కవితనో రాయమనంటే అప్పచెప్పిన సమయంలోపే దానిని పూర్తి చేసి 'గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్' ను సొంతం చేసుకోగల సత్తా ఉన్న 'నవయువ ప్రజాకవి' వనపట్ల సుబ్బయ్య. 

జీవితంలో కష్టాల కడగండ్లను లెక్క చేయక కవితల చిరునవ్వుతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న వనపట్ల సుబ్బయ్య రాష్ట్ర మంత్రులు,నాయకులు, మేధావులు, అధికారులు, కవులు ,రచయితల ప్రశంసలు పొందినా...ఎక్కడా తొణకకుండా తన కవితాదారిలో కొనసాగుతూనే ఉన్నడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ... ఒకేలా ఉన్న మిత్రులు వనపట్ల సుబ్బయ్య సాహిత్యంలో మరిన్నీ ఉన్నత శిఖరాలు, పురస్కారాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Follow Us:
Download App:
  • android
  • ios