Asianet News TeluguAsianet News Telugu

వఝల శివకుమార్ కవిత : ఇంక లెక్క తేలాలి

మనలోని అవిటితనాన్ని  పాలకుపాలు నీళ్లకు నీళ్లుగా లెక్క తేల్చాల్సిందే నంటు వఝల శివకుమార్ రాసిన కవిత  " ఇంక లెక్క తేలాలి" లో చదవండి.

Vajja Shivakumar Telugu poem in Telugu literature
Author
Hyderabad, First Published Sep 24, 2021, 4:34 PM IST

నేనెక్కడైనా ఎదురుపడ్డానా
దాటిన చాళ్ళల్ల
తిరగేసిన కవితల్ల
ఈ పేజీల మధ్య , పంక్తుల నడుమ
ఉత్సవాలను మోసి, ఉత్పాతాలను మోసి
దుక్కాలుమోసి 
దుర్భేద్యమైన మీ మనోప్రాకారాల్లోనే
శకలంగానైనా మిగిలిఉంటాను
నాకంటూ ఓ మూల 
కొద్దిగ జాగా ఉంటే చాలు

బహుశా ఓ విత్తు రాలిన చప్పుడు
నీకు వినిపించి ఉండకపోవచ్చు
మెత్తగ దిగబడిన వేర్ల సంగతీ
తెలువకపోవచ్చు
కొత్తగా మొలుస్తున్న 
ఆలోచనలల్ల నేనే ఊపిరెత్తుకొని
మళ్ళీ పుడతా

నన్నిలా ఉండనివ్వండి
నా ఊపిరితో నన్ను
సహవాసం చెయ్యనివ్వండి 
నాతో కలిసి ప్రయాణం చేస్తున్న
నా దేహ రథాన్నీ కాస్త గమనించుకోనివ్వండి

జ్ఞాపకాలో వ్యాపకాలో వాసనలో
ఏవో ఒకటి ఏదో వైపునించి
పొగ మంచులా కమ్మి
నన్ను కనపడకుండా చేసినప్పుడల్లా
నాకు నన్ను పరాయిగా
పరిచయం చేసినప్పుడల్లా
ఏదో ఓ దిగులు పొర గొంతుకడ్డం పడి
ఓ జీర నా స్వరం పొడూతా
మాటను బరువెక్కిస్తుంది.

ఆరాటాలో, అవివేకాలో, అరాచకాలో
నా సమయాల్ని కబళించి కాటేస్తున్నప్పుడు
బలహీనతల బంతులాటలో
ఓటమి చివర పశ్చాత్తాపాల మూట
కాలిపోయిన గడియారం బూడిదలో కాసిపుల్ల ఆట
అన్నీ తెలిసిన అజ్ఞానంలో నిరంతర దేవులాట 

ఇంతకూ పోగొట్టుకుంటున్నది 
నాదా ? పరాయిదా??

తప్పదని ఆడాల్సిన ఆట
గెలుపు గుర్రం వెనుక పరుగైన తండ్లాట
పోటీ ప్రపంచంలో  చోటు కోరే వెంపర్లాట.
వెనుకకు తిరిగి చూస్తే
దాటివచ్చిన కాలం పొడూతా
నాటిన మొలుకల్లో బతికినవెన్ని
ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని వాక్యాలు
మాడిపోయినవెన్ని 
మారాకులు తొడిగినవెన్ని 

ఇక లెక్క మొదలయింది
సామూహిక సూత్రాలు,  
సామయిక స్పందనలు
గుర్తింపుల గుప్పిట్లోకే 
ఒదిగి పోతున్నప్పుడు
సారం గురించిన చింత...
కూడికలు తీసివేతల భాగాహారంలో
శేషం గురించిన విచారం..
వెన్ను మీద ప్రశ్నల్ని మొలిపించింది
నడకలూ నడక పరమార్థాలూ లెక్క తేలాలి
నాలో అవిటితనం పాలు
పాలకుపాలు నీళ్లకు నీళ్లుగా
స్పష్టంగా చూసుకోవాలి.
నా బలాన్ని నిర్దారించు కోవాలి
ఆ కాస్త మిగిలింది నిభాయించు కోవాలి
అది నేనే అని ప్రకటితమవ్వాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios