వడ్డెబోయిన శ్రీనివాస్ కవిత: భాషొక మాటపిట్ట
మనిషి నుంచి మనిషి ప్రవహించే మాటలనది భాష అంటూ వడ్డెబోయిన శ్రీనివాస్ రాసిన కవిత "భాషొక మాటపిట్ట" ఇక్కడ చదవండి
పేగు బంధాల కొలనులో పుష్పించిoది
చెమట చుక్కల కులుకుల
మట్టి పరిమళమై వీస్తూ
లాలిపాటల ఉగ్గు పాలైంది
గోరుముద్దల చందమామైంది
అమ్మదనపు
పాలకమ్మదనమై
ఒంటి నిండా అల్లుకొని
బతుకు తియ్యదనమైంది
పెదాల మీంచి
పచ్చి పాలమీగడై జార్తూ
దాచి దాచి
ఇచ్చిన సద్దిబువ్వైంది
పాలు బోసుకున్న
ఊసకంకుల మాధుర్యమై
వొక వెన్నెల్లా
జీవితాన్ని ముసురుకొని
తడితడిగా నవ్వింది
నీడ నడచిన కాలమంతా
అమ్మై ఆవహించి
మనసు మీద వాలే
మాటపిట్టై కూర్చుంది
చుక్కల పంట చూసి
చెరువు నృత్యమైనట్టు
నా ఊహల పక్షులు
ఎగిరే రెక్కలైంది
మనిషి నుంచి మనిషి ప్రవహించే
మాటలనది భాష!
నా బతుకు కాగితం తడిపి
నన్ను పరిమళించింది