Asianet News TeluguAsianet News Telugu

పల్లెకథల సంపుటి "ఎదారి బతుకులు"

ఎండపల్లి  భారతి కథల సంపుటి  "ఎదారి బతుకులు"పై వి. వింధ్యవాసినీ దేవి చేసిన సమీక్ష

V Vindhayavasini Devi reviews Yendavalli Bharathi book od short stories
Author
Hyderabad, First Published Jul 21, 2021, 2:17 PM IST

రచయిత్రి ఎండపల్లి  భారతి మనస్సులో నిలవని , ఆమెను నిలవనీయని  జ్ఞాపకాల  దొంతరలు అక్షరాల్లోకి ఒదిగి  కథనరూపం సంతరించుకున్న కథల సంపుటి  – "ఎదారిబతుకులు".  పక్కింటమ్మాయితో ముచ్చట్లు పెట్టినంత సహజంగా  అల్లిన కథలివి. శిల్పార్భాటాలు  గానీ ,  శైలీ విన్యాసాలు గానీ, భాషా సొబగులు గానీ అద్దిన కథలు కావివి.  బడుగుజీవుల కన్నీటిచెమ్మను స్పర్శింప జేస్తూ ,  వారి  జీవనసంఘర్షణను  సమర్థవంతంగా  చిత్రించిన కథలివి.   తన చుట్టూ  అలుముకున్న  పల్లెయుల  బతుకువెతల్ని , వారి మనుగడలోని సంఘర్షణని కెమరాకంటితో  గ్రహించి వారి వాస్తవ జీవనచిత్రాల్ని కథలరూపకంగా మలచడంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు.  దిగువ మధ్యతరగతి జీవితాల్లోని ఆటుపోటులకు  అద్దం పట్టిన కథలివి.  కృత్రిమ సామాజిక వాతావరణానికి అనివార్యంగా అలవాటుపడిన  మనసుకు పల్లె జీవన ప్రాకృతిక సౌందర్యాన్ని ఈ కథల ద్వారా రుచి చూపుతుంది  కథాయిత్రి .  చిత్తూరు జిల్లా యాసలో రాసిన కథల్లో ఎక్కడా అతిశయోక్తులు కనిపించవు.  కల్పనలకు  ఊహలకు  చోటులేదు.  పున్నమి వెన్నెలంత స్వచ్చంగా కనిపిస్తాయి.

ముప్పై కథలున్న  ఈ సంపుటిలో దళిత , స్త్రీ , దళిత స్త్రీ కోణంలో రాయబడినవే అధికం.  చిన్న చిన్న కోరికలను  నెరవేర్చుకోవడం కోసం సాధారణ పల్లె స్త్రీలు పడే ఆరాటం , కుటుంబంలోని   మగవారు  వ్యసనాలకు బానిసలై స్త్రీల పట్ల వ్యవహరించే  అనుచిత ప్రవర్తన, నిస్సహాయ మగువల విషయంలో చోటుచేసుకునే అన్యాయాలు, ఒక్కో రూపాయిని  కూడబెట్టుకొని పెద్ద నోట్లుగా మార్చుకొని  మురిసే ముసలమ్మలు అ నోట్లు  చెల్లవని తెలిసినప్పుడు  వారనుభవించిన మానసికక్షోభ, అమానవీయ స్థితిలో జీవితాన్నిగడుపుతున్న  దళితుల వేదనలు  ఇలా  అనేకాంశాలు ఈ కథల ద్వారా  చర్చించబడ్డాయి. స్త్రీలు , దళితుల జీవితాల్లో పైకి  కనిపించని ఎన్నో కన్నీటి చారికలను  సున్నితంగానే చెప్పినట్టు అనిపించినా వారి వేదనలు మనల్ని  వెంటాడుతూనే ఉంటాయి .

దళితుల పట్ల సభ్యసమాజం కనబరిచే వివక్షకు నిదర్శనంగా నిలిచే కథలు – ‘గురువుదేవర జాతర ‘ , ‘కుట్టేవానికి మెట్టు కరువు’ , ‘మాయన్న సదువు’ , ‘తడిక తోసింది ఎవరు’  మొదలైనవి.  గురువు దేవర జాతర కథలో  దళిత వర్గానికి చెందిన వ్యక్తి  వ్యక్తపరచిన అభిప్రాయాలు , అతని ఆవేదన ఆలోచింపజేస్తుంది.  ఎంతో శ్రమపడి గొడ్ల చర్మాన్ని ఒలిచి , అందరికి చెప్పులు తయారుజెసే  వ్యక్తికీ చెప్పులు వేసుకునే భాగ్యాన్ని నిషేధించిన వైనాన్ని వెల్లడించే  కథ కుట్టే వానికి మెట్టు కరువు.  నాడు ,నేడు అని కాకుండా ,  తరాలు మారినా దళితులు , దళితేతరుల మధ్య  చెరగని అంతరాలను స్పష్టంగా , సూటిగా  చెపుతుంది రచయిత్రి .  వివక్ష రూపు మార్చుకుందే తప్పా చెరిగిపోలేదన్న చేదు నిజాన్ని  బహిర్గతం చేస్తుంది  రచయిత్రి ఎండపల్లి భారతి.

ఆధునిక సాంకేతిక రంగం పుణ్యమా అని నట్టింట్లో తిష్ట వేసిన టీ .వీ  మనుషుల మధ్య సహజ బంధాల్ని విడదీస్తున్న వైనాన్ని ఎదారిబతుకులు కథలో చూడొచ్చు .  పొద్దస్తమానం  కులీ నాలి చేసి ,అలసి సొలసిన వ్యక్తులు ఒకరి కష్ట సుఖాల్ని మరొకరికి చెప్పుకుంటూ తనివితీరా కాలం గడిపేవా రొకప్పుడు. నేడు ప్రతి ఇంట్లో టీ.వీలు  ప్రవేశింకాక , మనిషికి మనిషికి  మధ్యన మైళ్ళ దూరం ఏర్పడింది .   ఈ విషయం పట్ల   రచయిత్రి  ఘాటైన స్పందన కనిపిస్తుంది .  'అవ్వ తలపులు' కథలో  జాతరకు పొయ్యే తొవ్వలో అవ్వ చెప్పిన ముచ్చట్లు కొంత నవ్విస్తూనే కలవరపరుస్తాయి.  దళిత స్త్రీ ఎదుర్కొన్న అవమానాలు, ఆమె పై జరిగిన అఘాయిత్యాలు ఎవరికీ  చెప్పుకోలేని ఆమె  దైన్య స్థితికి  హృదయం దుఃఖ ప్లావితం కాకమానదు .  వస్తువు పట్ల మమకారాన్ని కలిగున్న స్త్రీ ఆరాటాన్ని,  అందుకోసం ఆమె చేసిన  ప్రయత్నాలను , తీర వస్తువు చేతికొచ్చాక జరిగిన పరిణామాలను ఆద్యంతం ఆసక్తికరంగా రూపుకట్టిన కథనం 'ఇత్తలిబిందె' కథలో  చూడవచ్చు. ఈ కథలలో కనిపించే మరొక అంశం - ఆకలి. సావుబియ్యం , గంగామ్మే బెదిరిపాయే , కడుపులు కాల్చిన కంది బేడలు , బొగ్గు దవదకేసుకొని  మొదలైన కథల నిండా పరచుకొన్న ఆకలి  అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.  ఎన్ని ప్రభుత్వాలు మారినా , ఎన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నా , నేటికీ పేదల ఆకలి వేదనలను చూడాల్సి రావడం హృదయవిదారకం .  సావుబియ్యం కథలో తొమ్మిదేళ్ళ అమ్మాయి రెండు రోజులుగా  తిండి లేక ఉన్నోళ్ళు దానం చేసే సావుబియ్యం తెచ్చుకొని ఆకలి మంటను చల్లార్చుకుంటుంది.   తీరా సావుబియ్యం తింటే చనిపోతారన్న తండ్రి మాటలు విని వేదనకు గురవుతుంది.    బలీయమైన ఆకలిబాధకు సావుబియ్యం , బతుకుబియ్యం ఉండవనీ కాలే కడుపును చల్లార్చే బియ్యమే ఉంటాయని చెప్పిన బోయ కొండవ్వ మాటలకు స్థిమిత పడుతుంది. బడుగుల పేదరికాన్ని పట్టి చూపే కథ ఇది.  దప్పికతో అల్లాడిపోయే చిన్నారికి మంచినీళ్లు ఇవ్వడానికి కులం కారణంగా సంకోచించే మనస్సులను 'దప్పి' కథ ద్వారా   పరిచయం చేస్తుంది రచయిత్రి .  కథలన్నింటిలోనూ పేదరికం పెను శాపంగా మారిన జీవితాలను చూపెడుతుంది రచయిత్రి .

అట్టడుగు కులాల గ్రామీణ జీవితాలను, వారి సంస్కృతీ సంప్రదాయాలను , వారి ఆర్తిని, వారి ఆక్రందనలను హృద్యంగా  చిత్రించడాన్ని గమనించవచ్చు ఈ కథలలో.   చదివింపజేసే లక్షణం పుస్తకం నిండా పరచుకొని , అనేక ఆలోచనలను చదువరుల ముందుంచిన కథాసంపుటిది.

Follow Us:
Download App:
  • android
  • ios