Ukraine Russia War: డా.కె.గీత కవిత "యుద్ధప్రశ్నలు కొన్ని- "
యుక్రేనియా మీదా రష్యా దాడి నేపథ్యంలో కాలిఫోర్నియా నుండి డా.కె.గీత రాసిన కవిత "యుద్ధప్రశ్నలు కొన్ని- " ఇక్కడ చదవండి.
అమ్మా! మనమెక్కడున్నాం?
పక్క దేశంలో
నాన్నేడీ?
మన దేశంలో
మన ఇల్లు?
ఉందో లేదో తెలీదు
మా బడి?
బాంబు దాడిలో కూలిపోయింది
నా స్నేహితులు?
బతికున్నారో లేదో
మన బంధువులు?
ఎక్కడో క్షేమంగా ఉండాలని ప్రార్థిద్దాం
తెలిసిన వాళ్లు?
బంకర్లలోనైనా తలదాచుకున్నారేమో
మన నాన్న?
వెనకడుగు వెయ్యని వాడు
యుద్ధానికి ఎదురీదుతున్నవాడు
జంకుగొంకు లేని వీరుడు
మరి నేను
బాంబుల దాడిలో బతికిబట్టకట్టిన వీరుడివి
ఇంకా బాంబుల శబ్దం వినిపిస్తుందేవిటీ?
ఇంకా సైరను గుయ్యిన చెవిలో మోగుతుందేవిటి?
యుద్ధం ఎప్పటికీ నిన్ను వీడదు
కల్లోలం ఎప్పటికీ మనల్ని వీడదు
ఈ దేశంలో మనమెవ్వరం?
శరణార్థులం
జీవచ్ఛవాలం
మనం వెనక్కి వెళ్తామా?
తెలీదు
నాన్నొస్తాడా?
తెలీదు
మన దేశం ఏమవుతుంది?
తెలీదు
మన భవిష్యత్తు ఏవిటి?
తెలీదు .