Asianet News TeluguAsianet News Telugu

ఉద్యమ "పూల పరిమళం".. కోడం కుమారస్వామి కవిత్వ సంపుటి

అవినీతి పెరటి కుప్పలో పురిటి నొప్పులు పడుతున్న భారతిని అల్లూరి ఆజాద్ లను మళ్లీ ఇవ్వమని కలగంటున్నాడు అని కోడం కుమారస్వామి కవిత్వ సంపుటి  " పూల పరిమళం " పైన సాగర్ల సత్తయ్య రాసిన పుస్తక సమీక్ష ఇది.. 

Udyama "Pula parimalam" Kodam Kumaraswamy poetry collection
Author
First Published Sep 14, 2022, 12:43 PM IST

ఆవేశం అక్షర రూపు దాల్చినప్పుడు నిప్పు కణిక లాంటి కవిత్వం పుడుతుంది. అసహనం పెల్లుబికినప్పుడు అక్షరం పిడికిలి బిగిస్తుంది. విప్లవ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లాకు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కోడం కుమారస్వామి కవిత్వం చదివినప్పుడు పాఠకుని మదిలో సరిగ్గా ఇటువంటి భావాలే ఉబికి వస్తాయి. ఆయన ఇటీవల వెలువరించిన "పూల పరిమళం " కవిత్వం సామాన్యుడి హృదయ ఘోషను వినిపించింది. ఈయన దీర్ఘ సమాసాల కోసం, అంత్యప్రాసల కోసం ఆరాటపడే కవి కాదు. ఒక లక్ష్యం కోసం,  సమాజ చైతన్యం కోసం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా పాఠకులకు చేరవేసే కచ్చితత్వం ఈ కవిత్వంలో కనిపిస్తుంది.  మొలకెత్తిన చోటును మరిచిపోని ప్రేమ గుణంతో పాటు ప్రజల పక్షం వహించే కవిత్వం కుమారస్వామిది.

"మా క్యాంపస్ లో కనిపించని మృగం ఒకటి
పట్టపగలే స్వైర విహారం చేస్తోంది
నా దోస్తులకు వాళ్ల అయ్యవ్వలు పంపిన
చెమట చుక్కల మనియార్డర్ను
ఆంగ్ల మాధ్యమంలో కలుపుకొని తాగుతోంది
నీ చనుబాలతో నేర్చిన తేనె తెలుగంటే దీనికి అసలు గిట్టదు "   (కారటు)

కవిత్వంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. తల్లికి ఉత్తరం రాస్తున్న తరహాలో  అద్భుతమైన కవిత్వాన్ని పండించాడు కవి కుమారస్వామి.  ప్రపంచీకరణ చాప కింద నీరులాగా మన ఉనికిని కబళిస్తున్న తీరును చక్కగా కవిత్వీకరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అడుగంటుతున్న మానవ సంబంధాలను, విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనుబంధాలను హరిస్తున్న వైనాన్ని సాంకేతిక పరిభాషలోనే  ఈ విధంగా చెప్పారు -
"క్రెడిట్ కార్డు కు గ్రీన్ కార్డుతో మూడుముళ్లకు
ఇంటర్నెట్ కంప్యూటర్ కళ్యాణ వేదిక
ఫామ్ హౌస్ లో  పాప్ గీతాల హోరులో
తూనీగలా ఊగిపో లేచిపో..."  (నెల బాలుడు) అంటూ హెచ్ వన్ బి వీసా కోసం ఎగబడుతున్న వైనాన్ని వ్యాధితో పోలుస్తూ ఆది హెచ్ఐవి కంటే ప్రమాదకరమని హెచ్చరిస్తారు. యంత్రంలా మారిపోతున్న  మనిషి జీవితానికి ఈ కవిత దర్పణంగా నిలుస్తుంది. ప్రగతి కోసం అభ్యుదయం కోసం 'కలంతో అక్షరాలను సాయుధీకరిస్తూ నవోదయం కోసం లిఖిస్తాను' అని తన కవిత్వ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రేమ కవిత్వంలోనూ ఉద్యమ స్వరాన్ని వినిపించగలిగిన నిబద్ధుడైన కవి కుమారస్వామి.

"మనిషి అంటే విశ్వవిఫణిలో ఎగరేసిన నాణెం కాదని
మానవత్వంలో జీవించాలనే ఆశయమని రాజ్యానికి రిపోర్టు ఇవ్వు " (దోస్త్) అంటూ మానవీయ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న వైనం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తాడు.

"మనసు మనసుని కలిపే
జనపదాల మాటను నిషేధిస్తే
ప్రపంచం ఒక కంప్యూటర్ రోబోట్ " (మనిషి ఒక పాట) నిజమే..  కాస్తో కూస్తో మానవత్వం ఇంకా మిగిలి ఉంది అంటే అది పల్లెటూర్లలోనే. ఆ పల్లెటూర్లు అనే మాటను నిషేధిస్తే కంప్యూటర్ రోబోట్ లాంటి కృత్రిమ సంబంధాలు కాక సహజత్వం ఎక్కడ ఉంటుంది?  మనిషి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసిన కవి  మనిషి జాడ కోసం తపన పడుతున్నాడు. జీవితానికి కవి ఇచ్చిన నిర్వచనం   అతని తాత్వికత లోతులను తెలియజేస్తుంది.

"రాత్రొక మరణం
ఉదయమొక జననం
పొద్దస్తమానమే జీవితం " అంటూ జీవితానికి వినూత్నమైన నిర్వచనాన్ని ఇచ్చారు. మరొకచోట " చెమ్మగిల్లని నయనం చీకటి తాకని జీవితం అసలు ఎక్కడుంది? " అని ప్రశ్నిస్తాడు.
మాట్లాడే స్వేచ్ఛను హరించే ప్రభుత్వాలను నిరసిస్తూ మాట్లాడాలని నినదిస్తారు.
"గుండె పటువ కన్నీటి నెత్తురు బరువైనప్పుడు సుట్టకుదురై మాట్లాడాలి
ఆంక్షలపై మాట్లాడాలి ఆకాంక్షలపై మాట్లాడాలి " - కవి ప్రజా చైతన్య గొంతుకగా  నిలబడ్డాడు అనడానికి ఈ కవిత్వ పంక్తులు నిదర్శనాలు. శాంతి సామరస్యాలు కలిగిన ప్రపంచం కోసం కలగంటున్నాడు ఈ కవి. రైతు జీవితం పచ్చగా ఉండాలని పేదల బతుకులు అక్షరాయుధాలతో  మాటల తూటాలు పేల్చాలని అవినీతి పెరటి కుప్పలో పురిటి నొప్పులు పడుతున్న భారతిని అల్లూరి ఆజాద్ లను మళ్లీ ఇవ్వమని కలగంటున్నాడు. కవి ఆకాంక్షించే సమాజం రావాలని ఆశిద్దాం.

నేల అంటే ఉత్తి మట్టి మాత్రమే కాదని అది కష్టజీవుల చెమట చుక్కల కలల్ని పూయించే కార్య క్షేత్రం అని, ఆరుద్ర పువ్వులు పూసే త్యాగాల నేల అని అందంగా వర్ణించారు. మలితెలంగాణ ఉద్యమ స్పృహతో  కూడా కుమారస్వామి కవిత్వం కనిపిస్తున్నది. భాషా సంస్కృతుల విషయంలో అవహేళన, నీటి పంపకాలలో వివక్ష  మొదలైన అంశాలను తన కవిత్వం ద్వారా ఎత్తిచూపారు. పెత్తనాన్ని ఎదిరించడానికి, బానిసత్వాన్ని ధిక్కరించడానికి, ఆత్మగౌరవాన్ని సాధించుకోవడానికి  ఉద్యమమే పరిష్కారమని తేల్చి చెప్పారు కుమారస్వామి.

"విముక్తి కోసం మన నేల పొత్తిళ్లలో
పోరు విత్తనాలు చల్లుకుందాం  "( పులి) అని ఈ కవి పిలుపునిస్తున్నాడు.
జయశంకర్ యాదిలో రాసిన ఎలిజీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రతిఫలించింది. జయశంకర్ జీవితాన్ని స్పృశిస్తూనే  తెలంగాణ కోసం ఆయన తపనను  చక్కగా అక్షరీకరించారు. నిస్వార్ధంగా ఆదివాసుల కోసం  పోరాడుతున్న వీరుల  త్యాగాలను తమ కవిత్వంలో కొనియాడారు. వారిని ఆదివాసీలలో ఆలోచనల అగ్ని వెలిగించిన చెకుముకి రాళ్లుగా అభివర్ణించాడు.

రాజకీయ నాయకుల స్వార్థ బుద్ధిని ఎండగడుతూ
"చెప్పిన పని చేస్తడన్న నమ్మకం లేదు
ఎంతమంది దొంగ ఓట్లకు పుట్టినోడో?
గందుకే ఇచ్చిన మాటకు నిలవడు" అంటూ కుహనా రాజకీయ నాయకుల పై దుమ్మెత్తి పోసాడు. ప్రపంచ మార్కెట్లో  రూపాయి పతనానికి గల కారణాలను తన కవిత్వంలో అన్వేషించాడు. ఈ ఆర్థిక సంక్షోభంలో   మధ్యతరగతి జీవితాల అవస్థలపై  ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికంతటికి  అవినీతి నాయకులే కారణమని తేల్చి చెప్పాడు.  అందుకే
"ఖద్దరు మాఫియా ఎయిడ్స్ కు మందు లేదు
నిర్మూలనే అసలైన చికిత్స" (చికిత్స) అని తీర్పునిచ్చాడు.

కుమారస్వామి మొలకెత్తిన చోటు వడ్డిచెర్ల. మాతృభూమి పట్ల మమకారాన్ని చాటుకునేందుకు అందమైన కవిత రాశాడు.
"బతుకమ్మ నాడు పడుసు బొమ్మోలిగె
పూలజడేసుకుని పులకరిస్తది చెరువు " (వడ్డిచర్ల ) - ఎంతటి గొప్ప భావుకత? ఎంతటి గొప్ప అలంకారం? ఇట్లాంటి వాక్యాలు కుమారస్వామి కవిత్వంలో అనేకం కనిపిస్తాయి. దుఃఖ సముద్రాన్ని కొంగులో దాచుకొని అమృత భాండాన్ని ఇచ్చిన కరుణిమగా అమ్మను వర్ణించారు. అక్షర చైతన్యపు పొద్దుపొడుపులుగా జర్నలిస్టులను ఆవిష్కరిస్తాడు. చేనేత కార్మికుల కష్టాలకు అద్దం పట్టే కవిత 'నెమలికన్ను'.  విద్యా వ్యాపారుల విష కౌగిలిలో బందీ అయిన ప్రైవేటు అధ్యాపకుల వెతలను  చిత్రించిన కవిత 'అభద్రుడు'.  బడా వ్యాపారుల  దళారీల భాగవతాన్ని బట్ట బయలు చేసిన కవిత ' మేకిన్ ఇండియా '.

దేశంలో ఎన్నటికీ చెరిగిపోని అంతరాలలో జీవిస్తున్న ధనిక పేద వర్గాల  మధ్య తారతమ్యాలను ఏకరువు పెట్టిన కవిత ' పరాహుషార్ '.  స్వదేశీ పేరిట  ఇతర మతస్తులను ఊచ కోత కోయడాన్ని  నిరసించే కవిత 'ఉన్మాది దాహం'.  విప్లవ రచయితల సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ కాశీం పై కుట్ర కేసుకు నిరసనగా రాసిన కవిత ' నల్ల బల్ల '. వరవరరావును బంధించడాన్ని నిరసిస్తూ రాసిన కవిత 'బందీ'.  స్త్రీల పక్షపాతిగా రాసిన కవిత 'మను'. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా  రాసిన కవిత ' బతుకు కొట్లాట'. ఇట్లా చెప్పుకుంటూ పోతే చక్కని శిల్ప శ్రద్ధతో, అద్భుతమైన భావనాబలంతో, గొప్ప అభివ్యక్తితో రాసిన కవితలు ఎన్నో  ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

మెతుకు మల్లెలు, వెలుగు వాసన, బ్యూరోక్రసీ బోయలు, ప్రశ్నల కొడవలి, పిడికిళ్ల వాన, ఉద్యమ చనుబాల ధార, త్యాగాల విత్తనాలు, వెన్నెల పూలు, వస్త్ర పద్యం, చీర కావ్యం, డాలర్ పురుగు,  పూల నవ్వులు, కంటి గుమ్మం, కరువు దూప, వంటి పద చిత్రాలు  పాఠకుడి మనసును పరిమళభరితం చేస్తాయి.

        భూమి శిరసుపై వేలాడుతున్న గ్లోబల్ కత్తి -
        సుర్మా కన్నీళ్లను తాగుతున్న త్రిశూలం -
        రేల పాటల్లో ఓనమాలు దిద్దిన శంభూకుడు -
        పొలిమేరలో ఆయుధం పొదుపుకొని
        కన్నుల తోరణాలకు వేలాడుతున్న చూపులు -
        పదవుల పంజరంలో బందీ అయిన  మేధావులు            మౌనం పోస్టు  మాడర్న్  కుట్ర -
        నిరసన కలాలకు నిర్బంధ లాఠీ సత్కారం -
        గద్దకు అధికారం  తలకు ఎక్కిన మత్తులో    
        కాకులు,   కోయిలపై గుల్లేరు కుట్రలు -
        కాగితం కలాలు దున్ని పలుకులు అలికి                        ములుకులు  పండిస్తం -
        బొంత పేగుల జీవన సమరంలో మీ ఇంటికి వస్తే            చేనేత వస్త్రమై ఆలింగనం చేసుకోండి -
 
ఇట్లాంటి భావ చిత్రాలు ఈ కవిత్వం నిండా కోకొల్లలుగా కనిపిస్తాయి. పాఠకులను ఆలోచింపజేస్తాయి. పూల పరిమళం అనే శీర్షిక చూసిన వెంటనే మృదు మధురమైన భావుకతను ప్రకటించే ప్రేమ కవిత్వం కాబోలు అనుకున్నాను. సామాజిక స్పృహతో, సామాన్యుల ప్రతినిధిగా కోడం కుమార స్వామి  రాసిన ప్రజా కవిత్వమిది. ఇది నిజంగా ఉద్యమ పూల పరిమళం. ప్రజల వైపు నిలబడే కవులు, రచయితలు అందరూ తప్పకుండా చదవాల్సిన కవిత్వం.

ప్రతుల కోసం:
కోడం కుమారస్వామి
జనగామ జిల్లా
Mobile: 9848362803

Follow Us:
Download App:
  • android
  • ios