గోపగాని రవీందర్ 'శతారం' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ బండా ప్రకాష్

తెలుగు విమర్శనా సాహిత్యానికి కొత్త చేర్పు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపగాని రవీందర్ రచించిన శతారం పుస్తకమని ఎమ్మెల్సీ బండా ప్రకాష్ అన్నారు.

trs mlc banda prakash launched gopagani ravinder shataram book

హైదరాబాద్: తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపగాని రవీందర్ రచించిన శతారం పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఆవిష్కరించారు. మంగళవారం ఎమ్మెల్సీ కార్యాలయంలోనే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా రచయిత రవీందర్ పై బండా ప్రకాష్ ప్రశంసలు కురిపించారు. తెలుగు విమర్శనా సాహిత్యానికి కొత్త చేర్పు రవీందర్ 'శతారం' పుస్తకమని ఎమ్మెల్సీ అన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి ఇలాగే కవులు, రచయితలు కృషి చేయాలని అన్నారు. తాను ఓరుగల్లు సాహితీ సర్వస్వం, నిఘంటువు కోసం ప్రయత్నం చేస్తున్నాను... కాబట్టి సృజనకారులు అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ కోరారు. 

రచయిత గోపగాని సాహితీ విమర్శనా వ్యాసాల్లో ఉద్యమ సాహిత్యం, అస్తిత్వవాదాల సాహితీ అంశాల గురించి వివరించారని బండా ప్రకాష్ తెలిపారు. పరిశోధకులకు కరదీపికగా ఈ గ్రంథం ఉపయోగపడుతుందని అన్నారు.  కవిత్వంతో పాటు సాహిత్య వ్యాసాలు రాయడంలో గోపగాని ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ అభినందించారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త ముప్పా మల్లేశం, ఏకశిలా యూత్ అసోసియేషన్ అండ్ లైబ్రరీ సలహాదారుడు మ్యాకల సూరయ్య, తెలుగు భాషోపాధ్యాయుడు ఇల్లందల వెంకటస్వామి, ముప్పా శివసాగర్, గోపగాని స్నేహసాగర్ తదితరులు పాల్గొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios