Asianet News TeluguAsianet News Telugu

తోకల రాజేశం కవిత : మట్టి భాష

అమ్మలక్కల చీరకొంగుల నుంచి రాలిపడే మాటల్లోని తెలుగు తల్లి వైభవాన్ని మంచిర్యాల నుండి తోకల రాజేశం రాసిన కవిత  ' మట్టి భాష ' లో చదవండి:

Tokala Rajesham's poem - bsb
Author
First Published Dec 22, 2023, 11:13 AM IST

నోటితో అక్షరాలను ఏరుకోవటం
తెలిసిన తరువాత 
పదాలను కాగితపు పొలంలో నాటేయటం 
నేర్చిన  తరువాత
భాష తెలిసిందని సంబరపడ్డాను

నా కలం నుంచి
ప్రాణహితా జలాలు కురుస్తుంటే
నా గళం నుంచి
కోయిల స్వరాలు విరుస్తుంటే
నాదే అసలు భాషగా భ్రమ పడ్డాను

నాయిన రెండెద్దుల నడుమ నాగలై
చాళ్లుగా విచ్చుకుంటున్న భూమితో మాట్లాడుతున్నప్పుడు
నా తల్లి పొలం గడప మీద ఆకుపచ్చని ముగ్గులేస్తూ
మట్టిగొంతునెత్తి పాటందుకున్నప్పుడు
తెలుగు భాష
అన్నం మెతుకంత తియ్యగా మారటం చూసాను

నా చెయ్యి పట్టుకొని
రామాయణం చుట్టూ భారతం చుట్టూ తింపుతూ
నాయనమ్మ చెప్పే కథల్లోని పలుకులు
జీడి పలుకులంత కమ్మగా ఉంటై

మా ఊరి నుంచి మంచిర్యాలకు పోయే బస్సులో కూసుంటే
అమ్మలక్కల చీరకొంగుల నుంచి 
రాలిపడే మాటల్లోని తెలుగు తల్లి 
కాళ్లకు చేతులకు వెండి కడియాలు పెట్టుకున్న 
నిండు ముత్తైదువులా కనిపిస్తుంది

చదువుకున్నోళ్లంతా భాష నోట్లో మట్టి కొడుతుంటే
భాషకింత మట్టినిపూసి బతికించుకుంటున్నది వాళ్లే

Follow Us:
Download App:
  • android
  • ios