డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) కి తెన్నేటి లత - వంశీ పురస్కారం

అమెరికాలో నివాసముంటున్న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, సంపాదకులు, గాయని, భాషా నిపుణురాలు డాక్టర్ కె.గీతామాధవికి ప్రతిష్టాత్మక తెన్నేటి లత - వంశీ పురస్కారం లభించింది. 

tenneti latha vamsi award to geetha madhavi

వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వారు అమెరికాలోని కాలిఫోర్నియా నివాసురాలైన ప్రముఖ రచయిత్రి  డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత)కి,  ప్రముఖ రచయిత్రి "డా.తెన్నేటి లత - వంశీ" జాతీయ పురస్కారాన్ని బహుకరించనున్నట్లు వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధాదేవి తెలియజేశారు.  ఆగస్టు 7,  2022  ఆదివారం సాయంత్రం 6 గం.లకు సుందరయ్య కళా కేంద్రం మొదటి అంతస్తు బాగ్ లింగంపల్లి (తెలంగాణ రాష్ట్రం) హైదరాబాదులో ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ తనికెళ్ల భరణి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నారు.

తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించిన డాక్టర్ కె.గీత కవయిత్రి, రచయిత్రి, సంపాదకులు, గాయని, భాషా నిపుణులు. పూర్తి పేరు గీతామాధవి.  “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపకులు & సంపాదకులు. నివాసం అమెరికాలోని కాలిఫోర్నియా.   సాఫ్ట్ వేర్ రంగంలో  "తెలుగు భాషా నిపుణురాలి" గా అమెరికాలో పనిచేస్తున్నారు.  
 
ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి  కె. వరలక్ష్మి, శ్రీ కె.రామ్మోహన్రావు గార్ల పుత్రికే గీతామాధవి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు.  పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు.  2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" పొందారు.  

ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట (2022)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల వీరి రచనలు. "అపరాజిత -  2022  " (గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవితా సంకలనం 1993-2022)  కు సంపాదకత్వం వహించి ప్రచురించారు.   'గీతా కాలం', "అనగనగా అమెరికా" అనే కాలమ్స్,  "నా కళ్లతో అమెరికా", "యాత్రాగీతం" అనే  ట్రావెలాగ్స్,  "కంప్యూటర్ భాషగా తెలుగు" అనే తెలుగు, ఇంగ్లీషు భాషల్లో  భాషా పరిశోధనా వ్యాసాలు వీరి ఇతర రచనలు.

కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం  పురస్కారాలు పొందారు. 2019 లో "తెలుగు టైమ్స్" వారిచే  అమెరికాలోని 17 మంది తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు. అమెరికాలోని "తానా" తెలుగు బడి "పాఠశాల"కి కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు.  లలిత సంగీతంలో మంచి ప్రవేశంతోబాటు అనేక బహుమతులు అందుకున్నారు. 2017 లో  "బట్టర్ ఫ్లైస్"  సినిమాతో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. “గీతామాధవి” షార్ట్ ఫిలిమ్స్ అధినేత.

టోరీ తెలుగు రేడియోలో "గీతామాధవీయం" పేరుతో సంగీత, సాహిత్య టాక్ షోని నిర్వహిస్తున్నారు. అమెరికాలో "వీక్షణం" సాహితీ వేదిక, "తెలుగు రచయిత" వెబ్సైటు వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నిర్వాహకురాలు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios