హైదరాబాద్: ప్రముఖ తెలుగు రచయిత్రి వాసా ప్రభావతి తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళల పాత్రపై ఆమె అక్షరీకరించారు. ఆమె లేఖనీ సంస్థ నిర్వాహకురాలు కూడా. ఆమె 40కి పైగా పుస్తకాలు రాశారు. ఆమె వయస్సు 81 ఏళ్లు.

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమెకు కూతుళ్లు మీనాక్షి, లక్ష్మి, మాధవి, కుమారుడు సూర్యప్రకాశ్ ఉన్నారు. ప్రభావతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం. 

ఆమె తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది కాశీచైనుల సూర్యనారాయణ. 1958లో ఆమె వీవీజే శాస్త్రిని వివాహం చేసుకుంది. ఆయన ప్రోత్సాహంతో హైదరాబాదులో ప్రభావతి కళాశాల విద్యను అభ్యసించారు 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆమె ఎంఎ తెలుగు, భాషాశాస్త్రంలో పీజీ డిప్లమా పొందారు. ఆంధ్ర సాహిత్యంలో హరిశ్చంద్రోపాఖ్యానం అనే అంశంపై పరిశోధన చేసి 1978లో పిహెచ్ డీ పట్టా పొందారు. సరోజినీనాయుడు వనితా మహా విద్యాలయం తెలుగు శాఖలో లెక్చరర్ గా, రీడర్ గా పనిచేశారు 

ప్రభావతి సేవకు గాను సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు, గృహలక్ష్మి స్వర్ణ కంకణం వంటి పలు అవార్డులు వచ్చాయి.