‘ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం’ పుస్తకావిష్కరణ
గులాబీల మల్లారెడ్డి కవితా సంపుటి ‘ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం’ ను శుక్రవారం (జూలై 2) ఉదయం తన ఛాంబర్‌లో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కిషన్ రావు ఆవిష్కరించారు.
టెక్నాలజీ ఎంతగా విస్తరించినప్పటికీ వ్యవసాయమే మానవ జీవన మనుగడకు మూలమని, అందుకే ఆరుగాలాలు శ్రమపడే రైతు జీవితం నేపథ్యంగా కవిత్వం విస్తృతంగా రావాలని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ టి.కిషన్‌రావు అన్నారు. గులాబీల మల్లారెడ్డి కవితా సంపుటి ‘ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం’ ను శుక్రవారం (జూలై 2) ఉదయం తన ఛాంబర్‌లో ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ గ్రామాలు, గ్రామాల్ని అంటిపెట్టుకొని ఉండే రైతులే అభివృద్ధికి సూత్రధారులని చెప్పారు.
అన్నం పెట్టే రైతులు చెమట చిందిస్తేనే పట్టణాలు, నగరాలు కళకళలాడుతాయని తెలిపారు. అన్ని రంగాలలో నూతన టెక్నాలజీ వచ్చినట్టే వ్యవసాయ రంగంలోకి వచ్చిందని, అయితే ఎద్దు ఎవుసం, నాగలి, కొండి, కొండ్ర పదాలు అంతరించిపోతున్న తరుణంలో కవి గులాబీల మల్లారెడ్డి చక్కటి వ్యవసాయ పదబంధాలతో ఎన్నో మంచి కవితలు రాసారని విసి ఆచార్య కిషన్‌రావు చెప్పారు. ఈ కవిత్వం చదువుతుంటే మట్టిపరిమళాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుందని అన్నారు. ఈ పుస్తకంలోని ప్రతి కవిత వ్యవసాయ సంస్కృతిని ప్రతిఫలించేలా వుందని, రైతును కావ్యనాయకునిగా చేసుకొని ఇలాంటి కవిత్వం మరింతగా రాయాలని కవి గులాబీల మల్లారెడ్డిని అభినందిస్తూ కిషన్‌రావు చెప్పారు.
యాంత్రీకరణ, వ్యాపారీకరణ పెరగకముందు ఉన్న వ్యవసాయిక జీవనంలోని మానవీయకోణాలు మల్లారెడ్డి కవిత్వంలో దర్శనమిస్తాయని ప్రముఖ విమర్శకులు గుడిపాటి అన్నారు. తెలంగాణ పల్లె పదాలు, పలుకుబడులు, నుడికారం ఈ కవిత్వాన్ని జవజీవాలతో తొణికిసలాడేలా చేశాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వైస్‌చాన్సలర్ టి.కిషన్‌రావుకి కవి గులాబీల మల్లారెడ్డి పూల బొకే అందించి, శాలువా కప్పి సత్కరించారు.
టి. కిషన్‌రావు విసిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆవిష్కరించిన పుస్తకం ‘ఎద్దు ఎవుసం సురకుల వైద్యం’ కావడం హర్షణీయమని తెలుగు యూనివర్సిటీ పిఆర్‌ఓ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతు జీవనంపై అపారమైన మమకారం కలిగిన కిషన్‌రావు గారు ఈ పుస్తకం ఆవిష్కరించడం ముదావహమన్నారు.