అత్తివిల్లి శిరీష జ్ఞాపకార్థం శ్రీమతి అండ్‌ శ్రీ అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం గార్లు కథల పోటీ నిర్వహించాలని సంకల్పించారు. వారి సహకారం తో ఈ కథల పోటీ నిర్వహణకు చొరవచూపింది ‘పాలపిట్ట’.

హైదరాబాద్ : జీవితం విశాలమైంది... మన చుట్టూ ఉన్న సమాజం అనేకానేక వైరుధ్యాలమయం. లోకంలో భిన్నపోకడలు, భిన్నరీతులు ఉండటం సహజం. పరస్పరం అర్థం చేసుకుంటూ సంయమనంతో పదుగురితో కలసిమెలసి సాగిపోవడమే బతుకు పరమార్థం. ఇందుకు తోడ్పడటానికి మించిన ప్రయోజనం సాహిత్యానికి మరొకటి లేదు. ఈ క్రమాన సాటి మనుషుల పట్ల కాసింత దయ, ప్రేమ చూపుతూ సంస్కారాన్ని ప్రోది చేయడం కథా రచన లక్ష్యంగా ఉండటం ఉపయుక్తం. ఈ దిశగా కథా సాహిత్య సృజనని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అత్తివిల్లి శిరీష జ్ఞాపకార్థం శ్రీమతి అండ్‌ శ్రీ అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం గార్లు కథల పోటీ నిర్వహించాలని సంకల్పించారు. వారి సహకారం తో ఈ కథల పోటీ నిర్వహణకు చొరవచూపింది ‘పాలపిట్ట’. సమాజంలో ఉత్తమ కథా సాహిత్యం మరింతగా రావాలన్న ఉద్దేశమే ఈ కథల పోటీకి ప్రేరణ... కనుక ఈ పోటీకి కథలు పంపించవలసిందిగా కథకులని ఆహ్వానిస్తున్నామని పాలపిట్ట నిర్వహకులు తెలిపారు. 

మొదటి బహుమతిః రూ. 5000
రెండో బహుమతిః రూ. 3000
మూడో బహుమతిః రూ. 2000
ఐదు కథలకు ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1000

నియమ నిబంధనలు: 

- సమాజం సాహిత్యానికి గని వంటిదని పెద్దలు అన్నారు. అనేక పాయలతో కూడిన సామాజిక జీవితంలో వైవిధ్యం, వైరుధ్యాలు అపారం. భిన్న వృత్తులు, ప్రవృత్తులున్న సమూహాలు అనేకం. ఆధునిక సమాజాన ఏకకాలంలో మనుషులు సంఘజీవులుగానూ, ఒంటరి ద్వీపాలుగానూ వుండటం వైచిత్రి. అందుకని కథావస్తువుల ఎంపిక ఆయా రచయితల ఇష్టం. ఇతివృత్తానికి సంబంధించి ఎలాంటి పరిధులు, పరిమితులు లేవు.

- ఏం చెప్పారన్నదే కాదు ఎలా చెప్పారన్నది కూడా ప్రధానం. కనుక ఎంచుకున్న వస్తువును కేంద్రంగా చేసుకొని కథను కళాఖండంగా తీర్చిదిద్దడం ముఖ్యం. ఇదే ఈ పోటీలో ప్రముఖంగా పరిగణనలోకి తీసుకునే అంశం. ఇతివృత్తాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో రచయితలు చూపిన కౌశలానికి ప్రాధాన్యం ఉంటుంది.

- తను నిర్దేశించుకున్న వస్తువును ఎన్ని పదాలలో, ఎన్ని అక్షరాలలో చెబుతారన్నది ఆయా కథకుల అభివ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశం. కనుక కథలకు ఎలాంటి పేజీల పరిమితి లేదు. పదాల, పేజీల షరతులేవీ లేవు.

- పోటీకి పంపించే కథలు సొంత కథలయి ఉండాలి. అనువాదాలు కాదు. అలాగే ఇదివరలో ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాకూడదు. సోషల్‌ మీడియాలోగానీ, ఇతర వెబ్‌సైట్లలో గానీ ప్రచురితమై ఉండరాదు. ఈమేరకు కథతోపాటు హామీపత్రం పంపించాలి.

- కవర్‌ మీద అత్తివిల్లి శిరీష జ్ఞాపకార్థం నిర్వహించే కథల పోటీకి అని రాయాలి. పోటీ నిమిత్తం పంపించే కథలు తిప్పి పంపడం సాధ్యం కాదు.
- కథతో పాటు రచయిత పూర్తి చిరునామా పంపించాలి. మెయిల్‌లో పంపించేవారు ఓపెన్‌ ఫైల్‌తో పాటు పిడిఎఫ్‌ పంపించడం మంచిది.

- కథల ఎంపిక విషయంలో పాలపిట్ట సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎలాంటి వాదవివాదాలకు, సంప్రదింపులకు తావు లేదు.

- ఈ పోటీలో ఎంపిక చేసే కథలని పాలపిట్టలో ప్రచురించడంతోపాటు భవిష్యత్తులో తీసుకురానున్న కథల సంకలనాలలో ముద్రిస్తాం.

కథలు పంపించాల్సిన చిరునామా:
ఎడిటర్‌, పాలపిట్ట
ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044
ఫోనుః 94900 99327
email: palapittamag@gmail.com

మాకు కథలు చేరవలసిన చివరి తేదీ - 30 జూన్‌ 2023

ఈ కథల పోటీ పలితాలు ప్రకటించే తేదీః 30 జూలై 2023