Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పోరాటచరిత్రను రికార్డు చేసిన కథలు

సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో గులాబీల మల్లారెడ్డి రచించిన ‘ఐదుతరాలు’ కథల సంపుటి ఆవిష్కరణసభ నిన్న జరిగింది.  ఆ సభ వివరాలు ఇక్కడ చూడండి : 

Telugu story book written by Gulabeela Mallareddy AKP
Author
First Published May 15, 2023, 12:23 PM IST

తెలంగాణ ప్రాంత పోరాట చరిత్రను రికార్డు చేస్తూ గులాబీల మల్లారెడ్డి కథలు రాయడం ముదావహమని ప్రముఖ కవి, రచయిత, మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో గులాబీల మల్లారెడ్డి రచించిన ‘ఐదుతరాలు’ కథల సంపుటి ఆవిష్కరణసభ జరిగింది. సభలో పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను లిఖిస్తూ మల్లారెడ్డి అద్భుతమైన కథలు రచించారని, ముందుతరాల వారికి  ఈ కథలు ఎంతో ఉపయుక్తమని ఆయన అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల సిలబస్‌లో పెట్టదగిన కథలు ఇవని నరసింహారెడ్డి చెప్పారు. గులాబీల మల్లారెడ్డి వంశంలోని అయిదుతరాల వారు అన్యాయాలను వ్యతిరేకిస్తూ ధిక్కారస్వరం వినిపించడం తెలంగాణ పోరాట సంప్రదాయాన్ని తెలియజేస్తుందని ఆయన శ్లాఘించారు. తెలంగాణలో వున్న కథకులకు ఇవి చక్కని పాఠాలని, పోరాటాల గురించి ఎలాంటి కథలు రాయాలో ఈ కథలు చదివితే తెలుస్తుందని నరసింహారెడ్డి ప్రశంసించారు. 

తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభకు విశిష్ట అతిథిగా హాజరయిన తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మంత్రి శ్రీదేవి ప్రసంగిస్తూ ఐదుతరాల పోరాటయోధులని కన్న మాతృమూర్తులు అభినందనీయులని అన్నారు. మదర్స్‌ డే నాడు వారిని తలచుకుంటూ ఈ పుస్తకం ఆవిష్కరణ సభ జరుపుకోడం తెలంగాణ మహిళలకు గర్వకారణమని ఆమె చెప్పారు. తెలంగాణ నేల మీద వందేళ్ళ చరిత్రలో ప్రజల కోసం పోరాడిన ఆ మాతృమూర్తులకు తెలంగాణ ప్రజానీకం రుణపడివుందని చెప్పారు. తెలంగాణలో నేలకోసం, నీళ్ళకోసం పోరాడినా ఆ ఐదుతరాల వారి కలలు ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. పాలనలో నెరవేరాయని చెప్పారు. తెలంగాణ పోరాట వారసత్వాన్ని తెలంగాణ భాషలో తన కథల ద్వారా రికార్డు చేసిన గులాబీల మల్లారెడ్డిని మంత్రి శ్రీదేవి అభినందించారు. 

ఈ సభలో పాలపిట్ట పత్రిక ఎడిటర్‌ గుడిపాటి ప్రసంగిస్తూ ఐదుతరాలకు చెందిన వారంతా ప్రజల పక్షాన నిలబడటం, విలువలకు కట్టుబడి అన్యాయాలను ఎదిరించడం గొప్ప విషయమని అన్నారు. జనం క్షేమం కోసం తెలంగాణ రచయితలు ఇలాంటి కథలు రాయాల్సిన అవసరముందని సూచించారు. తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి ప్రసంగిస్తూ తెలంగాణ చరిత్రని రికార్డు చేస్తూ ఐదుతరాల పోరాటయోధుల కథలు గులాబీల మల్లారెడ్డి రచించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమచరిత్రను రికార్డు చేసిన ఆయన కథలు తెలంగాణ కవులకీ, రచయితలకీ ఆదర్శప్రాయమని అన్నారు. ఇంకా ఈసభలో ప్రముఖ కవులు రాపోలు సుదర్శన్‌, ప్రమోద్‌ ఆవంచ, వేముల ప్రభాకర్‌, అన్నవరం దేవేందర్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌, కూర చిదంబరం తదితరులు ప్రసంగించారు. తెలంగాణ యోధుల  చరిత్రను సత్కరించిన గొప్ప కథల పుస్తకం ‘ఐదుతరాలు’ అని కొనియాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios