ప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత
ప్రసిద్ధ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కారా మాష్టారుగా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు తెలుగు కథా రచయితలకు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.
శ్రీకాకుళం: ప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. యజ్ఞం కథ ఆయనకు విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆయన ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో కథానిలయం కూడా నడుస్తోంది. తెలుగు కథా రచయితల వివరాలన్నీ అందులో పొందుపరిచారు. కథా సంపుటాలు కూడా అందులో ఉంటాయి.
కారా మాష్టారుగా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు 1924 నవంబర్ 9వ తేదీన శ్రీకాకుళలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడు. యజ్ఞం రచనకు ఆయనకు 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. శ్రీకాకుళంలో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు. 1948 నుంచి ఆయన 31 ఏళ్ల పాటు ఎయిడెడ్ పాఠశాలలో ఉద్యోగం చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు.
2008 జనవరి 18వ తేదీన లోకనాయక్ ఫౌండేషన్ వారు విశాఖపట్నంలో ఆయనను సన్మానించారు. ప్రభుత్వ విధానాల పట్ల నిరసనతో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించారు
ఆయన రచనలు యజ్ఞం, అభిమానాలు, రాగమయి, జీవధార, కారా కథలు, కథాకథనం, కథా యజ్ఞం వెలువడ్డాయి.