నేల గంధం పరిమళాలను విస్తరింపచేస్తున్న వాన చినుకుల ముచ్చట్లను  గోపగాని రవీందర్ కవితలో చదవండి.

పగలంతా మబ్బుల చాటున
దోబూచులాడే వాన చినుకులు
కురవడానికి సిద్ధంగా ఉన్నాయని
పరి పరి విధాల మాట్లాడుకుంటుంటే
అవెట్లా విన్నాయో తెలియదు కానీ
మనలో అనేక ఆశలురేపి
అంచనాలను తలకిందులు చేస్తు
ఇక్కడ హఠాత్తుగా మాయమవుతుంటాయి 
మరెక్కడో ప్రత్యక్షం కావడానికి..!

ఊహలకందని సమయంలో
నల్లబడిన ఆకాశం
మెత్తబడిన హృదయాల్లా మబ్బులు
చిక్కని చీకట్లతో 
ముసుగులు ధరించిన పరిసరాలు
కిటికీల గుండా ప్రవేశిస్తున్న
చల్లని గాలుల స్పర్శలు
తన్మయత్వానికి లోనుచేస్తున్నాయి..!

గూళ్ళను చేరుకోవడానికి 
గుంపులు గుంపులుగా పక్షులు
వరుసల్లో ప్రయాణిస్తు
కనువిందు చేస్తున్నాయి
ముకుళిత హస్తాలతో
ఆహ్వానం పలకడానికి
ఆనందమయంగా ఎదురుచూస్తున్న
అద్భుత క్షణాల్లో
టపటపమని వయ్యారంగా
పూల గుత్తుల్లా రాలి పడుతూ
భూతల్లిని ముద్దాడుతున్నాయవి..!

అనుకోని అతిథిలా
రాత్రి వచ్చిన వాన చినుకులు
శ్రీమతిని పలకరించగానే
చిన్నపిల్లల వలె
కేరింతలతో చిందులు వేస్తూ
ఎప్పటెప్పటి సంగతులనో
తలచుకుని తలచుకుని
వాటితో ముచ్చట్లు పెట్టింది
అవి అలసిపోయి ఆగిపోయే దాకా..!

అనేక రాత్రుల జ్ఞాపకాలను
దృశ్యమానం చేస్తు
నేల గంధం పరిమళాలను
అంతట విస్తరింపచేయడానికి
ఆగకుండా పరుగులు తీస్తున్నవి
రాత్రి పలకరించిన వాన చినుకులు..!