వారాల ఆనంద్ కవిత : గాలి ఓ అనాధ

గాలంటే మనకు దయలేదు ప్రేమ లేదు అంటూ వారాల ఆనంద్  రాసిన కవిత  '  గాలి ఓ అనాధ ' ఇక్కడ చదవండి : 

Telugu Poem written by Varala Anand AKP

కులం లేదు మతం లేదు 
గాలికి 
గూడు లేదు నీడా లేదు 
గాలి ఓ అనాధ 

గట్టు మీద చెట్టు మీద చెరువుమీద 
ఇంటి మీద మురికి కాలువ మీద 
నా మీద నీ మీద ఎక్కడెక్కడో వుంటుంది 
ఎక్కడయినా వుంటుంది 
గాలి ఓ నిర్వాసితురాలు 

కాళ్ళు లేవు 
ఒక చోట నిలబడదు 
విరామం లేదు విసుగూ లేదు 
గాలి ఓ నిరంతర యాత్రికురాలు 

కంటికి కనబడదు
ఒంటికి తెలుస్తుంది 
గాలి పారదర్శకం 

కాలింగ్ బెల్ నోక్కకుండానే 
దర్వాజాలోంచి దర్జాగా ఇంట్లోకొస్తుంది  
కిటికీల్ని టపటప లాడిస్తుంది 
వెంటిలేటర్లోంచి తొంగి చూసి లోనికి దూరుతుంది 

గోడలకు వేలాడేసిన కాలేండర్లనీ, ఫోటోలనీ 
దడ దడ లాడిస్తుంది    

హాల్లోకి వంటింట్లోకి ఆడపడుచు 
వచ్చినట్టు చొచ్చుకొస్తుంది 
దానికి ఎవరి అనుమతి అక్కర్లేదు 

బెడ్ రూము లోకొచ్చినా 
మనం సిగ్గుపడం దుప్పటి కప్పుకోం 
 
కానీ ఎండ చేసిన నేరానికి 
గాలిని కట్టడి చేస్తాం కండీషన్ల పెడతాం 

గాలి ఇంటిలోకే  కాదు 
నింతరంగా ఒంట్లోకీ చేరుతుంది     

గాలి నాలుగు క్షణాలెక్కడయినా 
దాక్కుంటే దాగుడు మూతలాడితే 
ఊపిరి నిలబడి పోతుంది పాడెక్కేస్తాం 

గాలి మన చుట్టూరా తిరుగుతుంది 
మనం దాని చుట్టూరా అల్లుకుంటాం 
బట్టలు ఆరేస్తాం, పంటలు తూర్పార బడతాం 

వాకిట్లోనో వాకింగులోనో వరండాలోనో 
గాలి హాయిని వినోదిస్తం 
మంద్రంగా వీస్తే హాయిగా ప్రాణం లేచొస్తుంది 
కొంచెం వేగంగా వీస్తే ఈదర గాలి పాడు గాలి అంటాం 
అంతేనా గాలి మాటలు గాలి తిరుగుడు అంటూ నిందిస్తం 

గాలంటే మనకు దయలేదు ప్రేమ లేదు 
ఎవరి పైనయినా వాటిని కోల్పోయి 
చాలా కాలమే అయింది

    

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios