వఝల శివకుమార్ కవిత : పుస్తక క్షేత్రం

హైదరాబాద్ లో నేడు పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతున్న సందర్భంగా రెక్కలు మొలిపించే అంతర్నేత్రం విశ్వ దర్శన ద్వారమైన పుస్తక క్షేత్రం అంటూ వఝల శివకుమార్ రాసిన కవిత  " పుస్తక క్షేత్రం " ఇక్కడ చదవండి. 

Telugu poem written by Vajjala  Shiva kumar

అక్షరాల వర్షాన్ని కప్పుకునే
ప్రశాంత సముద్రం 
కుదురుగా ఉండలేని వరద గూళ్ళ ఒడి

వానలో తడవడానికి 
తరలి వచ్చిన తోటలు
లేత ఆకుల వేళ్ళతో మబ్బులను తడిమినట్టు
ర్యాకులనుంచి పుస్తకాన్ని తీసుకుని 
గొడుగులు లేకుండా నానే దాహ దేహాలు

మట్టి వాసన చిప్పిల్లే బురద
చప్పుడు లేకుండా కురిసే 
లోపలి చినుకులు 
ముద్దై పోయే లోగిలి

వర్ణ ప్రపంచాల ద్వారంలో 'ధరణి'
సందేహాల తీరం మీద 'ఇజ్రా' 
నిత్యసత్యాల వెంట 'నిశ్చల' 'గీతిక'లు
పంక్తుల మధ్య పరవశంలో 'సౌరభ్'‌
పాదలేపనంతో 'మణికంఠు'ని ప్రపంచ విహారం

కణుపు కణుపులో లక్ష్యాన్ని నింపుకుంటూ ఎన్నెన్ని మొక్కలో
విత్తులై జారి అంకురాలైన
ఎన్నెన్ని విత్తనాలో...
వనానికి ప్రాణం పోస్తున్న వాననూ
వానను బతికించుకుంటున్న వనాన్ని
అక్కడే చూశాను

బోసి కొమ్మలతో వచ్చి 
పూల గొడుగులై విచ్చుకోవడం
గాలి గాలంతా
సీతాకోకచిలుకల మైదానమై
మురిసిపోవడం
లోపలికి అడుగు పెట్టిన పాదాలు
నాదాత్మల పెదాలై పలవరించటం
ఓ ప్రత్యక్ష అనుభవం

శబ్ద ఋతురాగ స్పర్శ
పుస్తకాల పుష్యరాగం 
పున్నమి పుప్పొడుల 
పారిజాత పవనం 
నిరంతరం
మూగ సంకెళ్ళను తెంపే ముసురు
అలుపు లేని జ్ఞానధార 
దైన్య శూన్య వర్తమానాల మీద కురిసే
తపనల సారం ...

బీటలువారిన బాటలకు
పచ్చిక సోయగాలద్దే తడి పలకరింపు
కదిలే అడుగులకు 
లోచూపు లోచనాలిచ్చే
పుస్తక మేఘాల దయా దృష్టి ...
చూపుకు ‌
రెక్కలు మొలిపించే 
అంతర్నేత్రం
విశ్వ దర్శన ద్వారమైన పుస్తక క్షేత్రం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios