వారాల ఆనంద్ కవిత : ఆమె
వారాల ఆనంద్ కవిత 'ఆమె' ఇక్కడ చదవండి.
ఒక్కర్తే
వేదనగా దుఃఖంతో
చెంపలమీద కన్నీటి చారికల్తో
పెరటి గుమ్మం మీద కూర్చుంది
లేచి నాలుగడుగులేసి
ఇంటిముందటి వాకిట్లోకి నడిచింది
వీధిలోకి అటూ ఇటూ దీర్ఘంగా చూసి నిట్టూర్చి
తిరిగొచ్చి
మళ్ళీ పెరటి గుమ్మం మీద కూర్చుంది
ఎవరికోసం అని అడిగాన్నేను
తల పైకెత్తి ఆకాశంలోకి చూసింది
ఏమైంది అని మళ్ళీ అడిగాను
తలదించి నేల వైపు చూసింది
పెరటి గుమ్మం గడపమీద
అలవి కాని దుఃఖాన్ని
నాలుగు కన్నీటి బొట్లని రాల్చి
మౌనంగా లేచి వెళ్లిపోయింది
రాత్రి వేళ చిమ్మచీకట్లో
మోగిన తుపాకీ మోతలు
అనేక ఏళ్లుగా ఆమె గుండెల్లో
ప్రతిధ్వనిస్తూనే వున్నాయి