డా. ఉదారి నారాయణ కవిత : వానొస్తుంది 

మేఘాలకు మనిషితనం లేదు గనుక ఇచ్చిన మాటను విసిరేసే గుణం కాదు గనుక ' వానొస్తుంది ' అంటూ ఆదిలాబాద్ నుండి డా. ఉదారి నారాయణ రాసిన కవిత  ఇక్కడ చదవండి : 

Telugu Poem written by Udari Narayana AKP

వానొస్తదా
నిజంగానే వానొస్తదా!

రావాలనడానికి 
పెనం మీది నూనె బొట్టులా
చెరువులో మూలనున్న నీటిచుక్కలే సాక్ష్యం
వానొస్తది
మేఘాల కడుపుల్లో
ఎన్ని రోజులు గర్భవతిగా గడుపుతుంది 
ఆకాశం చీకటి గదిలో
ఎన్నిదినాలు పురిటి నొప్పులు భరిస్తుంది
వానొస్తది
నేడో, రేపో, ఇప్పుడో, ఈజామో, ఆజామోవచ్చి
సూర్యుని ఎండదుప్పటిని
నీటి కత్తులతో చీల్చి
భూమిపై పచ్చని తివాచి పరిచి
 గర్మివాళ్ళు  తనివి తీరా
హాయిని పీల్చుతున్నపుడు
కళ్ళారా చూసి మురిసి పోదామని
వానొస్తది

ఆకుపచ్చని చెట్ల కురులు
ఎండకు ఎరుపెక్కినయని
పూల బాలల చెంపలు మాడి పోయాయని
పాలకోసం గుక్కపట్టిన పసిపాపలా
పశుపక్షాదులు నదుల ఎదలపై
తండ్లాడటంను చూడలేక  వానొస్తది 

ఎగదోస్తున్న మంటల్లో పడ్డ
భూచరాల కేకలు విని ఉండలేక వానొస్తది

మేఘాలకు మనిషితనం లేదు గనుక
ఇచ్చినమాటను విసిరేసే గుణం కాదుగనుక
మాటిచ్చి మోసపు మడుగులో
ముంచే  తత్వం లేదు గనక
కొంచెం వెనకో ముందో తప్పకుండా వస్తది 
మలినాలతో కడుపుబ్బిన
సముద్ర ఘోష విషమించడం చూసి
మనకు ప్రాణజల మివ్వడానికి వానొస్తది

భూమి ఆకాశాల సుదీర్ఘ ప్రేమకు
చిగురులు తొడగడానికి వానొస్తది
వాన  తప్పకుండా వస్తది 
 పక్షికంటి దుఖాన్ని తుడవడానికి 
పశువుల కాలిడెక్కల మంటలు ఆర్పడానికి 
చెట్ల తాపాన్ని తీర్చడానికి 
వానొస్తది వాన తప్పకుండా వస్తది 

తాను ఖాళీ దేహమై
తన జీవితమే ఖాళీ చేసిన ఇల్లయి
మనకోసం ఇక్కడో అక్కడో ఎక్కడోఒకచోట
వస్తూ కురుస్తూ పలుకరిస్తూనే ఉంటది
తన జీవధాతువుల్ని ధార పోస్తూనే ఉంటది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios