రూప్ కుమార్ డబ్బీకార్ కవిత : ఆసరా
ఆకుపచ్చని కలలు జారి పోకుండా జాగ్రత్త పడాలి అంటూ రూప్ కుమార్ డబ్బీకార్ రాసిన కవిత " ఆసరా " ఇక్కడ చదవండి:
ఎండు కొమ్మ పైన వసంతం చిగురించాల్సిందే
శిశిరాలపై తిరిగి పచ్చదనపు బాల్యం పొడసూపడం
ఆనందదాయకమే కదా
జీవితం ప్రకృతిలో ఒక అంశ ఐనపుడు
ఆరు రుతువులు దేహంపై ఆడుతూనే వుంటాయి
పొగచూరు వాసనతో వచ్చే కలలతో మనకేం పని -
పరిమళించే రుతువుల సహజత్వాలు
మన జవసత్వాలు కావాలి
భుజం గుమ్మి ఎప్పుడూ బరువుతో కుంగిపోయి ఉంటున్నా
కమిలి పోయిన కనురెప్పల మీద నుండి
ఆకుపచ్చని కలలు జారి పోకుండా జాగ్రత్త పడాలి
రుతువులు మాత్రం
కుంగిపోతున్న భుజాలకు ఆసరాగా ఉంటూనే వుంటాయి.