రాజేంద్ర రాజు కాంచనపల్లి కవిత : అతడు జాతిని జయించాడు
భంగపడిన మనసు కార్చిన కన్నీటి సిరా చుక్కలే కదా రాజ్యాంగం నిండా.. అంటూ హన్మకొండ నుండి రాజేంద్ర రాజు కాంచనపల్లి రాసిన కవిత ' అతడు జాతిని జయించాడు ' ఇక్కడ చదవండి :
అవమానాలను సన్మానాలుగా మార్చుకుని
అసాధారణ పనులు సుసాధ్యం చేసిన
సత్పురుషా జయహో..
అడుగు పెట్టొద్దన్నవారే గొడుగు పట్టుకుని
గౌరవించేలా చేసుకున్న తపస్వీ వందనం...
నడిచావు నేల సరిహద్దులు దాటి
పరిగెత్తావు శూన్యాకాశాలు దాటి
వ్యాపించావు విశ్వమంతా విజయకేతనమై
ప్రియ మార్గదర్శి జై భీమ్...
భంగపడిన మనసు కార్చిన కన్నీటి సిరా చుక్కలే కదా రాజ్యాంగం నిండా..
రాజీ పడిన బతుకులను రాజాల్లా మార్చిన
దార్శనిక వందనాలిక..
ఒక అడుగు
పది మందికి దారి అవుతుంది
ఒక ఆలోచన
వంద మందికి ఆచరణ అవుతుంది
మీ అడుగుల లోతు
ఆలోచన రచన
మా అస్తిత్వానికి దారి దిక్కు దిశ
మా ప్రత్యేకతకు సాధికారత
మేము ప్రత్యేక రాష్ట్రమైంది విడిపోవడానికి కాదు
మా ఉనికికి ఊపిరి అందించడానికి
మేమున్నామని నిరూపించడానికి
అచ్చం
మీ ఆలోచనలాగే
మీ ఆచరణ లాగే..
అందుకే మీరిప్పుడు మా నగరం నడిబొడ్డుపై..
తెలంగాణ గడ్డపై..
125 అడుగుల నిలువెత్తు జెండాగా
ప్రజా దేవాలయం సాక్షిగా...
రెపరెపలాడుతున్నారు రేపటి ఆశలకు భరోసానిస్తూ.