నా కవనాలు ఆ సముద్రుడి ఆగ్రహావేశాలు  తుఫానుల విధ్వంసాలు నిను మేల్కొలిపే విఙ్ఞాన వీచికలు అంటూ బెంగళూరు నుండి ఆర్. నవజీవన్ రెడ్డి రాసిన కవిత  ' నా కవనాలు ' ఇక్కడ చదవండి : 

నా కవనాలు లోకానికి ఉషోదయ కిరణాలు 
బానిసవర్గానికి ఆశాజ్యోతులు 
కార్మిక లోకపు ఆర్తనాదాలు 
యువశక్తికి ప్రగతిమార్గాలు 

నా కవనాలు దగాపడ్డ జనాల ఆత్మఘోషలు 
చేయూతనిచ్చి ముందుకి నడిపే ప్రేరణలు
పెళ పెళ మని గర్జించే మేఘపు ఉరుములు 

నా కవనాలు సామాన్యుడి చెమట చుక్కల సువాసనలు 
కసితో రగిలే బతుకుపోరాటాలు
ప్రజలకు స్ఫూర్తినిచ్చే బతుకు పాఠాలు

నా కవనాలు ఆ సముద్రుడి ఆగ్రహావేశాలు
కెరటాల సమూహాలు 
తుఫానుల విధ్వంసాలు
సాగర గర్భ రహస్యాల సంభాషణలు

నా కవనాలు అరిషడ్వర్గాల నియంత్రణా మార్గాలు
నిను మేల్కొలిపే విఙ్ఞాన వీచికలు 
మన జీవితాలకు మార్గదర్శకాలు 

నా కవనాలు మలయ మారుతాలు 
ప్రణయ గీతాలు 
ప్రేమ పాఠాలు 
హృదయాంతరాలలోని 
అగాథాల కావ్య రూపాలు 
ఆ అనంతుని కృపా కటాక్షాల కోసం
పాద సేవలో తరించే పుష్పాలు