చీకటిని కడుపులో దాచుకొని వెలుగును మాత్రమే తలా ఇంత పంచిబెట్టే ముడతలుపడ్డ వెన్నెల ఆమె అంటూ మహబూబాబాద్ నుండి పేర్ల రాము రాసిన కవిత " చెమట పూల పందిరి " ఇక్కడ చదవండి : 

పోద్దున్నే 
సద్ది కట్టుకొని పోయి
గోసిబెట్టి మునుం పట్టె ఆమె 
మట్టికి బువ్వపెట్టే మట్టితల్లి

చీకటిని కడుపులో దాచుకొని 
వెలుగును మాత్రమే 
తలా ఇంత పంచిబెట్టే 
ముడతలుపడ్డ వెన్నెల ఆమె

నడుస్తుంటే డొంకలో
బుసలుకొట్టే పాములు కూడా
మట్టి కాళ్ళకి జేజేలు చెప్పిపోయే
గొప్పతనం ఆమెది

ఆమె పొలము
కోయబోయినప్పుడల్లా
చేతిలో రంపేకొడవలి 
యుద్ధం నేర్చుకొంటుంది

చీకటి లోకంలో
తిరుగాడే పిల్లలని
తన హృదయకౌగిల్లో వెలిగించిన 
మిణుగురు వెలుగుల ఆశ ఆమె

మొన్నీమధ్య 
దారి తప్పి చేనుల్లోకి అడుగేశా 
చెమటపూల చీరని కట్టుకున్న 
పోశవ్వలాగే కన్పించింది ఆమె

నిజమే
వాగును దాటి 
చెరువును దాటి
నదిని దాటినందుకే 
సముద్రమైనిలబడింది ఆమె