కె ఎస్ అనoతా చార్య కవిత : సాహితీ పరిమళం !!

సాహిత్యం ఒక పరిమళ హంస అంటూ కరీంనగర్ నుండి కె ఎస్ అనoతా చార్య రాసిన కవిత  ' సాహితీ పరిమళం !! ' ఇక్కడ చదవండి : 

Telugu Poem written by KS Anantacharya OPK

ఈ గుంపు వాసన మీద వాలి
ముక్కుతో ఊదేస్తాయి
గాలితో దెబ్బలాడుతాయి!

పిల్లగాలి అయితే చల్లగా
పెన్నులోకి దిగి
జావళి యై 
భాషామ తల్లికి వింజామరలు వీస్తుంది!!

ఊపిరి తిత్తుల్లో నిండిన గాలి 
అక్షరమై వ్యాపనం చెంది 
సిరల చెడు చారికల మీద కొరడా ఝళి పిస్తుంది!

హోరుగాలి వానలా 
నిన్నటి ఉన్మాద చర్య 
నిగ్గు తెలుస్తుంది 
ద్రోహం మీద నిప్పు కణికలు విసురుతుంది !

ఒకచో ఎదురు తిరుగుతుంది
ఇంకొకచో 
ఎదిరేగి  వచ్చి
ఆత్మీయతో 
హత్తుకుంటుంది!

గాలి వేణువును పలకరించి స్వరమైనట్లు
వాక్యంలో దూరి శ్రేయమైన 
మున్నుడి అవుతుంది!

నిజమే ఒక్క ఉచ్వాసం 
ఒక్క నిశ్వాసం 
బతుకు మీద కథా శిల్పమై నిలుస్తుంది 
జీవ కణాలకు నడక నేర్పే
భామాకలాపమై కవ్విస్తుంది!

గాలిని బంధిస్తే
తిరుగులేని మంత్రమై 
సుదర్శనకవచమై నిల్వదా!

గాలి ఒక మాధ్యమం
ఈ వాహికయే  ప్రపంచపు
పరిచయ వేదిక!

చొరబడనంత సందున్నా చాలు 
 భార్యా భర్తల అలక తీర్చే  జవ్వాజి పరిమళ మౌతుంది 

సాహిత్యం ఒక 
పరిమళ హంస 
పూగుత్తులు ప్రసరించే 
కోమల వర్ణనాంశ!

ఇది ఝాంఝా మారుతమైతే
విప్లవ కణికను రగిలించే
క్రోధార్ణవ రుద్రాంశ!


ఎగిరితే ఒక శైశవగీతం
గాలి లేని కాయం
నీరెండిన
మౌన సంద్రం!
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios