కొప్పుల ప్రసాద్ కవిత : ప్రజాస్వామ్య సువాసనలు
నంద్యాల నుండి కొప్పుల ప్రసాద్ రాసిన కవిత" ప్రజాస్వామ్య సువాసనలు " ఇక్కడ చదవండి :
మరోచరిత్ర నడుస్తుంది ఆధిపత్యం కోసం
రాజకీయ రథానికి రంగులు వేస్తూ
కులమతాలే రథచక్రాలుగా తగిలించుకొని
జాతి కొరడాతో చురుక్కుమనిపిస్తూ కదులుతుంది..
నవసమాజ యజ్ఞములో సామాన్యుడు ఆహుతి
కుతంత్రాల నిప్పు అంటించి వేస్తుంటే
మానవత్వపు తోలు కొద్దికొద్దిగా తీస్తూనే
మరుగున పడేసిన దేశభక్తి జై కొడుతుంటే..
అశోక ధర్మ చక్రం రాజకీయం రథచక్రం
సింహంలా గాండ్రింపుల శబ్దం వినిపించదు
గీతా రహస్యపు మర్మం తెలియదు
సత్యమేవ జయతే సత్యం ఎక్కడ వినిపిస్తుంది...
బుద్ధుడి నడకలో సత్యత తెలియదు
గాంధీజీ సత్యాగ్రహ కర్రలు విరిగిపోతే
అడ్డదారిలో ప్రయాణం అందలమెక్కి కూర్చుంది
నిత్య సత్య వచనాలు సువార్తలా వినిపిస్తున్నాయి..
గ్రామ స్వరాజ్యం గాడి తప్పి తిరుగుతుంది
నగరానికి అప్పులు కట్టలేక గ్రామం ఏడుస్తోంది
గోచి గుడ్డలు మరకలంటి రైతు తిరుగుతుంటే
పాట్నాలో చొక్కాలు చిల్లులు పడి తేలుతున్నాయి..
దేశానికి వెన్నెముక అన్నదాత ఆర్తనాదం
దళారి చేతిలో మట్టి గడ్డలా కరిగిపోయే
రాశుల పంటను దోసిళ్ళతో లెక్కలు వేస్తూ
పెట్టుబడి సర్దుబాటుకు తనువును అర్పించే...
నేతన్నల మగ్గం నగ్నంగా తిరిగే
స్వాతంత్ర్య సమరంలో పగ్గాలు మాయమై
నూలు పోగుల తాళ్లు తలకు చుట్టుకొనే
అతడి పాడెకు అలంకారమై వస్త్రంగా మిగిలే..
సమస్త వృత్తులు సర్వనాశనం
నేలమ్మకు ప్రాణం పోసిన శక్తులన్నీ మాయం
మానవ జాతి మనుగడకు శాపమై నిలిచే
నేడు జీవన్మరణ పోరాటంలో ఆకలి మిగిలే..
రాబోయే మరో లోకం ఎప్పుడు చూస్తాం
చూడని స్వర్గలోకానికి ప్రయాణం ఎందుకు
వాస్తవాలు తెలియని దేవేంద్రులు ఎందరో
ప్రజాస్వామ్య సువాసనలకి అలవాటు పడిరి... కదా..!!