డా॥ కొండపల్లి నీహారిణి కవిత : కడుపు తీపి
ఎడతెగని నేటి పోటీల్లో కన్న ప్రేమ మాధుర్యమొక్కటే ప్రథమ బహుమతి గెలుచుకుంటుందంటూ డా॥ కొండపల్లి నీహారిణి రాసిన కవిత ' కడుపు తీపి ' ఇక్కడ చదవండి :
ఎడతెగని తండ్లాటల చిత్రాలకు
చూపు దారాలు కడదాం రండి
అక్కడేమీ తపనల మేళాలు వినిపించవు
అక్కడ
మీ తడిసిన హృదయం
కుప్పల మెప్పుల మోతలెత్తాల్సినంత పనేం లేదు
కూలిపని ఇలా పచ్చని చెట్టుగూళ్ళకు బతుకు నెలవు
ఆకలితీరే పిచ్చుక పిల్లల కువకువ పరవశమె
మబ్బు కళ్లద్దాల నుండి డేగ కన్ను ఒకటి వీక్షిస్తుంటది
ఏ కోడినీ కోడి పిల్లను దాటేసుకోదు
అయినా తల్లి కోడి తనను
తన పిల్లలనూ కాపాడుకుంటూ
బతుకుపని పాట పాడుకుంటూ నిత్యశ్రమ గాయనిగా
బిడ్డలను రెక్కల క్రింద చేర్చుకుంటుంది
తట్టల కెత్తుకోగలిగే
ఇటుకల పంట అనురాగ గాథగా
మన ఇంటి గోడలవుతాయి
పొదుగు పొదుగు ఇదే చెప్తుంది
లేగ పరుగులో తోక ఆడినట్టు
కోన కోనల్లో కూనల సజీవత సమన్వయమౌతుంది
లేత పిందెల పనులూ కోరే చేతలకేమెరుక
అక్కడో బక్కజీవి తండ్లాట బంతాటలాటలాడుతుంటాయి
హృదయంలో బడబాగ్నులు చెలరేగకున్నా
రెండు కన్నీటి చుక్కలు నిత్య నక్షత్రాలను పూస్తూనే ఉంటాయి
తల్లి తపనల తమోన్నతత అంతా
ఊసుల ఊయలలవుతున్న సుందర దృశ్య మాలికలో పువ్వులన్నీ చూపులే అయినప్పుడు
శూన్యం నుండి సురలోకపు కబుర్ల వరకు
వెన్నెల నిచ్చెనలు వేసినట్టు
ఇక్కడో అమ్మ బొమ్మై మనను అట్లా అచేతన స్థితిలో పడవేస్తుంది
పేదతనం పొట్టకి గాని పసిపాపల పాలనకు కాదని
ఒకానొక పంక్తిని సహృదయుల గుండె గట్టు మీద
పరుగు పందేరానికి జత కట్టిస్తుంది
ఎడతెగని నేటి పోటీల్లో
కన్న ప్రేమ మాధుర్యమొక్కటే
ప్రథమ బహుమతి
గెలుచుకుంటుందని
ఢంకా బజాయించి చెప్తున్నాను