పుట్టిన గిట్టిన తేదీలు పాలరాతి మీద చెక్కుతుంటే ఘోరీ నవ్వుతుంది - అంటూ కందుకూరి శ్రీరాములు రాసిన కవిత " అంతా బూడిదే! " ఇక్కడ చదవండి:  

శూన్యం ! 
అంతా శూన్యం !

జీవమున్నంత సేపే 
జవం !
అహం !

ధిక్కారమైనా 
అధికారమైనా 

మనుషులిట్లా ఎందుకయ్యారు ?
తోడు రారు 
గోడు వినరు 

ఎన్నాళ్ళీ గద్దెలు, మిద్దెలు -
తెర ఎత్తగానే 
నాంది ప్రస్తావనలు -
ఉన్నంతసేపే వీధి భాగోతం !
తెరదించితే 
మంగళ హారతే ! 

కండలన్నీ మాడిపోయి 
కిరీటాలన్నీ కూరుకుపోయి 
పుట్టిన గిట్టిన తేదీలు 
పాలరాతి మీద చెక్కుతుంటే 
ఘోరీ నవ్వుతుంది 

ఎగిరితే పడిపోయేది 
కింద నేనని,
ఏం మిగులుతుంది 
చివరికి బూడిదేనని --