ఒక్కటే ధైర్యం చూపుడు వేలి వెనక నాలుగు మడిచిన వేళ్ళున్నాయి అంటూ మణిపూర్ ఘటనకి బాధతో డా||  కె.గీత  కవిత ' చూపుడు వేలి చివర ' ఇక్కడ చదవండి :  

అన్ని అసహనాలకీ
చూపుడు వేలు 
ఒక్కవైపే 
కదులుతుంది 

చివరికి
చూపుడు వేలి చివర
మా నగ్నదేహాల్ని 
వేలాడదీశారు కదరా!

తెగల పగలూ 
కుల ప్రతీకారాలూ 
మతోన్మాదాలూ 
దుర్మార్గ రాజకీయాలూ
యుద్ధాలూ
తిరుగుబాట్లూ
అన్నిటా 
తొలి దురాక్రమణ
మా దేహాలపైనే కదరా!

నిద్దట్లోనూ
కడుపులోంచి
రగిలే దుఃఖం
నగ్నంగా ఊరేగుతోంది 

మీ పైశాచికత్వానికి
నెత్తురోడిన 
దేహం
కలల చివర 
చితికి వేళ్లాడుతోంది 

అగ్ని ప్రకోపమై
లావా ప్రవాహమై
కుతకుత ఉడికే
మంట 
పగళ్ళని 
రాత్రుళ్ళని 
దహించివేస్తోంది 

అయినా 
ఒక్కటే ధైర్యం-
చూపుడు వేలి 
వెనక నాలుగు 
మడిచిన వేళ్ళున్నాయి 
పగిలిన దేహం వెనక 
ఆకాశంలో సగం ఉంది