గుడిపల్లి నిరంజన్ కవిత : ఏప్రిల్ మాసం- ధర్మ యుద్ధం !

మహానీయులు పుట్టిన మాసం ఏప్రిల్ మాసం.! అంటూ నాగర్ కర్నూల్ నుండి  గుడిపల్లి నిరంజన్ రాసిన కవిత  ' ఏప్రిల్ మాసం- ధర్మ యుద్ధం ! ' ఇక్కడ చదవండి : 
 

Telugu Poem written by gudipalli Niranjan AKP

ఎవరి పూర్వికులు మనకు కారు 
మన పూర్వీకుల జాడల్లోనే మనం నడవాలి 
ధర్మ యుద్ధం చేయాలి!

నిజమైన యుద్ధ 
అడుగుల సవ్వడి 
ఉద్విగ్న భరితంగా ఉంటుంది 
ఉత్కంఠ భరితంగా ఉంటుంది!

ఉజ్జాయింపు, అనునయింపు అడుగులు కాకుండా 
శౌర్యపు నడక యుద్ధమే మనమేంటో నిరూపిస్తుంది!

యుద్ధంకై నడుస్తుంటే 
దాడులుoటాయి 
స్వపక్షపు కోవర్టులుoటాయి 
వెనక్కి లాగే చర్యలుoటాయి 
ఉక్కిరిబిక్కిరి చేసి 
ఊపిరి సలపనీయని
కుట్రలుoటాయి ......

చివరి క్షణం వరకు 
హరివీర భయంకరమై
ప్రతిఘటించాలి మనం
ఎంతోమంది వీరులు నేలకొరిగిన
ప్రాణాలతో బయటపడే అవకాశం లేకపోయినా
ప్రకటించిన యుద్ధ లక్ష్యం 
పూర్తి కాకుండా 
పక్క బాటలోకి జారుకోవద్దు!

యుద్ధంలో ఆధిపత్యం, 
విత్త శక్తి 
వాళ్లకు సహాయ పడొచ్చు కానీ
ధర్మ యుద్ధంలో మన వైపు బుద్ధాశోక ,
రవిదాస్ కబీర్, 
ఫూలే అంబేడ్కర్ల 
ఆలోచనలు ఉన్నాయి .

యుద్ధం బలి తీసుకుంటుంది కానీ 
ధర్మ యుద్ధం జాతికి రక్షగా ఉంటుంది!
 
యుద్ధం ద్వేషిస్తుంది కానీ 
ధర్మయుద్ధం బానిసత్వం నుండి 
విముక్తి ప్రసాదిస్తుంది !

మరి మనం యుద్ధం వైపో
ధర్మ యుద్ధం వైపో తేల్చుకోమంటుంది..... 
మహానీయుల పుట్టిన మాసం
ఏప్రిల్ మాసం.!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios