గోపగాని రవీందర్ కవిత : కవి మిత్రుని కోసం..!
పొగడ్తల దుప్పట్లను దులుపుకొని రాటుదేలిన రచనల సారంతో యథార్థ వ్యాథార్థ గాథలనే లిఖించు..! అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత ' కవి మిత్రుని కోసం..! ' ఇక్కడ చదవండి :
నీ చుట్టురా
పగడ్బందీగా నిర్మించిన
నాలుగు గోడలను కూల్చేసి
బాహ్య ప్రపంచంలోకి అడుగేయి
పదాలకు అర్థాలు మారుతాయి
వాక్యాలు నదుల్లా పరుగెడుతాయి
సత్తువ కలిగిన అక్షరాల ఆలోచనలు
లోకాన్ని ముందుకు నడిపిస్తాయి..!
అన్నీ ఒకేలా ఉండవు
చూపించే నమూన పనికి రాదు
ఇది వద్దు ఇంకేది వద్దని పలికే
సచ్చు పుచ్చు మాటలింకెంత కాలం
పుడమి తల్లి కడుపులో
మంటలను రగిలిస్తున్న అరాచకత్వాన్ని
కూకటి వేళ్ళతో సహ పెకిలించటానికై
నీ కలానికి పదును పెట్టాలి
పొగడ్తల దుప్పట్లను దులుపుకొని
రాటుదేలిన రచనల సారంతో
యథార్థ వ్యాథార్థ గాథలనే లిఖించు..!
అడ్డదారులను తిరస్కరించి
గమ్యాన్ని ముద్దాడే రహదారులపై
గుబులు చెందకుండ పయనిస్తున్న
సాహసవంతులను గూర్చే రాయి..!
సుమనసులను ఉత్తేజపరుస్తూ
నూతనాలోచనలకు ఆలింగనాలనిస్తూ
వాగ్దానాల అమలుకై
కాంతి కిరణాలతో పోటీపడుతున్న
కార్యసాధకుడే మనకాదర్శమని చాటే
గేయాలుప్పోంగాలి సముద్ర కెరటాల్లా
అప్పుడే కదా నీ కవనం సార్ధకమయ్యేది..!