బంధాలు కారణాలు అల్లు తున్నాయి అనుబంధాలు అన్ని ప్రాంక్ ప్రాంక్ అంటూ దాసరి మోహన్ రాసిన కవిత  " ప్రాంక్... ప్రాంక్ " ఇక్కడ చదవండి.  

ఆమె సెలయేరు లా నవ్వుతుంటే
నేను సమయాన్ని అంకితం చేశాను
పెళ్లి ప్రయత్నానికి ప్రపోజల్ పెడితే 
ప్రాంక్ ప్రాంక్ ప్రేమంతా ప్రాంక్ అంది

మూడు ముళ్లు మంగళ వాయిద్యాలు
ఏడు అడుగులు ఎన్నో బాసలు
అరుంధతీ లేదు ఆనందం లేదు
సంసారం లో సుఖం ప్రాంక్ ప్రాంక్

పట్టు తప్పి పడిపోయినప్పుడు
చుట్టు ముట్టు నవ్వులే నవ్వులు
చేయి అందించి చేరదీసింది లేదు
సిట్టింగుల కే పరిమితం స్నేహం ప్రాంక్ ప్రాంక్ 

కుప్పకూలి మంచాన పడితే
కొడుకు రాడు కూతురు రాలేదు
బంధాలు కారణాలు అల్లు తున్నాయి
అనుబంధాలు అన్ని ప్రాంక్ ప్రాంక్

మైకు ముందు ఆశలు కుమ్మరిస్తే
ఓటు వేసి కుర్చీ మీద కూచో బెట్టా
మంచి చేయమని గుర్తు చేసి నిలదీస్తే
ప్రాంక్ ప్రాంక్ హామీ లన్నీ ప్రాంక్ ప్రాంక్ 

ప్రాంక్ కాలం ప్రపంచం
కొన్ని కెమెరాల ముందు
లెక్కలేనన్ని తెర వెనకాల 
ప్రాక్టికల్ గా బతకడం నేర్చుకోవాల్సిందే....