దాసరాజు రామారావు కవిత : యుద్ద సారం
ఒకే ఒక్క గాయమే భూగోళమంతై రసి గారుతూ వుంటుందెప్పటికీ అంటూ టెక్సాస్ నుండి దాసరాజు రామారావు రాసిన కవిత " యుద్ద సారం " ఇక్కడ చదవండి :
గెలుపే లక్ష్యమైన యుద్దం
ఓడటమే లక్షణమైన జనం
బలాల, అహంభావాల యుద్దం
హాహాకారాల, రూప వికారాల జనం
దుర్వూహాల, దుర్నీతుల యుద్దం
అమాయకాల, అబలత్వాల జనం
ఆయుధ మస్తీల, అధికార కుస్తీల యుద్దం
బాధల గాథల్లో ఈదడమే తెలిసిన జనం
తెంపుల కన్నా తొంపులే మిన్న అయిన యుద్దం
మాట మీదనే, జాగ మీదనే బతుకన్న జనం
బాంబుల, మిసైల్ల, అణ్వస్త్రాల విచ్చలవిడి విహారం యుద్దం
ఏ అశోకుడు చూసి కన్నీటి మయమౌతాడో
కఠిన ప్రతిజ్ఞాపరుడౌతాడో
అని ఎదురుకళ్ళ జనం
కారణాల, ఆరోపణాల, లోలోపలి కుట్రల,
సాకుల మేకులు గొట్టే యుద్దం
అలంకరణ తతంగంలో మైమరచి
బలి సంగతి తెలియని జనం
ఐక్యరాజ్యాలు, నాటోలు నియమావళిని మరచిన యుద్దం
ఆపన్నహస్తాలు ఊపడానికే...
ఆదుకోడానికని నమ్మిన జనం
మొదటి నుంచీ...
మొదటిదీ యుద్దమే
రెండోదీ యుద్దమే
ముదురు పాకాన మూడోదీ యుద్దమే
సంఖ్యలు సంఖ్యలుగా చావుల్లో జనం
యుద్ద మిత్రుడా! శత్రుడా!
నువ్వాటాడిన దేశపటమ్మీద
యిక పూలు పూయవు,
మనుషుల ఊహల వలె
నదులు పారవు,
మనుషుల ఆలోచనల వలె
దీపాలు వెలగవు,
మనుషుల బతుకుల వలె
ఒకే ఒక్క గాయమే భూగోళమంతై
రసి గారుతూ వుంటుందెప్పటికీ
ఏం ఆనందిస్తావో, చెప్పు…!