దండమూడి శ్రీచరణ్ కవిత : ఊహు!
ఈ సంచులూ, బీరువాలూ మోసుకుంటూ తిరగడానికి నువ్వేమైనా నత్తవా? అంటూ భువనగిరి నుండి దండమూడి శ్రీచరణ్ కవిత " ఊహు! " ఇక్కడ చదవండి :
అలా వెళ్లిపోవాలి...అంతే
మూలాల్లోకి
వేరుల చివర్ల వున్న మట్టి రేణువుల్లోకి
మనసు పొరల్లో అట్టడుగున ఆర్ద్రతలోకి
కడలి గర్భాన అణగి వున్న గవ్వలలోకి
అలా...
చెమ్మను గిల్లుకొని,
హత్తుకొని,
పీల్చుకుని
తెప్పరిల్లాలి.
దూకావా?
ఆ ధృవాల అంచు నుండి
ఈ మంచు కొండ శిఖరం పైకి
ఓకే ఒక అంగలో!
ఇంకేం మిగిలుంది ఈ జీవితంలో?
సజావుగా,బల్లపరుపుగా,నత్తలా.......?
అలా కాదుగా!?
నువ్వో కుంచెవో, ఉలివో,
మట్టి కుండను సుతారంగా తీర్చే వేళ్ళ లానో.......
అలాగన్నట్లు!
ఈ సంచులూ,పెట్టెలూ, బీరువాలూ
మోసుకుంటూ తిరగడానికి
నువ్వేమైనా నత్తవా?
బల్లపరుపుగా......!?
ఊహు!!
ఒక్క ఉదుటున...లోతుగా.. ఎత్తుగా..
వేగంగా.. చురుగ్గా అలాగన్నట్లు!!