చిత్తలూరి కవిత : ఆయన గురించి
ఈ ప్రపంచం ఆకలి కోసం మెతుకుపూల వానవుతాడు అంటూ చిత్తలూరి రాసిన కవిత " ఆయన గురించి " ఇక్కడ చదవండి :
ఆయన గురించి
ఎన్నిసార్లు చెప్పినా
ఇంకా ఇంకా చెప్పాలనే వుంటుంది
ఆయన గురించి
ఎంత రాసినా
ఇంకా ఇంకా మిగిలే వుంటుంది
ఆయనలో
మా నాయిన వుంటాడు
మా అమ్మ వుంటుంది
ఓ తాత వుంటాడు
ఓ బామ్మ వుంటుంది
నేల వుంటుంది
ఆకాశం వుంటుంది
నీరు వుంటుంది
నిప్పు వుంటుంది
ఈ సమస్త భూ ప్రపంచం
ఆయన చేతులతో
అమ్మగాళ్లాడుతూ బువ్వ తింటుంది
ఆయన అచ్చం భూమిలాగే
అన్నీ సహిస్తూ పోతాడు
నేలలాగే అన్నీ భరిస్తూ వుంటాడు
ఎన్ని తుఫాను గాలులు వీచినా
ఎన్ని చీడపీడలు సోకినా
అతివృష్టి అనావృష్టి లాంటి ఉపద్రవాలతో
ఆయన్ని నిలువెల్లా ముంచెత్తినా
దేశానికి అన్నం పెట్టాలనే ఆయన కలల్ని
నిలువునా ఛిద్రం చేసినా
ఏమాత్రం చలించడు
వెనుకడుగేయడు
అలుపెరుగని యోధుడై ఆయన
నిత్యంయుద్ధం చేస్తూనే వుంటాడు
ఈ ప్రపంచం ఆకలి ఎండ కోసం
ఆకుపచ్చని గొడుగుపడతాడు
ఎండిన డొక్కల కోసం
మెతుకుపూల వానవుతాడు
నిత్యం తానోడిపోయినా
ఈ దేశం ఆకలిని గెలిపించే
యుద్ధం చేస్తాడు
ఆయన గురించి
ఎన్నిసార్లు మాట్లాడినా
కొత్తగానే వుంటుంది
ఆయన గురించి
ఎన్నిసార్లు తలపోసినా
మనసంతా పచ్చగానే వుంటుంది