బొప్పెన వెంకటేష్ కవిత : శశి జాడలు

నిశి నీడలు కరిగిపోయే శశి జాడలు వెలుగులీనాలి అంటూ సిద్దిపేట్ జిల్లా మాచాపూర్ గ్రామం నుండి బొప్పెన వెంకటేష్  రాసిన కవిత " శశి జాడలు " ఇక్కడ చదవండి. 
 

Telugu Poem Written by Boppena Venkatesh

అల్లంత దూరంలో హర్మ్యాల అంతరంలో
ఎదిగి ఒదిగిన వెలుగుల చుక్కల కోసం
చీకటి అంటిన జీవితాలు
దీపాలు లేని ఇళ్ల దీనతలో
కష్టాలు కలతల నుంచి కదలాడుతుంటే
ఊర్థ్వముఖంగా ఊపిరి
దీపంలా మెలగాలని ఊసుపోతాయి

అమావాస్యతో  సావాసం
సాగించలేక ప్రాణం నుసిలా వాడిపోతుంది
వెంట వస్తున్న ఈదురు గాలిని
ఈడ్చుకొని నిలబడే దేహాలే
రేపటి ఆశా దీపాలవుతాయి
చీకటి రాజ్యాన్ని దేదీప్యమానం చేస్తాయి

ఏ గాలివేటుకో తూరుపు ముఖం పట్టకుండా
వెలుగులు పంచే ప్రేమ ఆరని దోసిలి పట్టాలి

అందనంత దూరంలో ఉన్న
ఆకాశ దీపపు వెలుతురు
అవని అంతా కురిసి
మట్టి శ్వాసలు మణి కాంతులై మెరవాలి
అందరి జీవితాలు తారల్లే విరియాలి

నిశి నీడలు కరిగిపోయే
శశి జాడలు వెలుగులీనాలి
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios