అంబేడ్కర్ అంటే నిలువెత్తు విగ్రహం కాదు రేపటితరానికి దారిచూపే భవిష్యత్తు అంటూ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన కవిత  ' సమున్నత శిఖరం ' ఇక్కడ చదవండి : 

తరతరాలుగా అణగారిన వారి కోసం
అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు
బడుగు, బలహీన వర్గాల కోసం
జీవితాంతం తపించిన పోరాటయోధుడు

సమాజంలో కుళ్ళిపోయిన అంటరానితనంపై
సమరశీలపోరాటం చేసిన సమరయోధుడు
కుల మత రహిత భారతదేశం కోసం
జీవితకాలం పోరాటం చేసిన వీరాధివీరుడు

అగ్రవర్ణాల ఆధిపత్యపంజాపై గాండీవం
పూరించిన అసలైన ఆధునిక అర్జునుడు
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికై
రిజర్వేషన్లను కల్పించిన దార్శనికుడు

అణగారిన వర్గాలకు అండగా నిలబడిన 
అసలైన ప్రజాస్వామ్య పరిరక్షకుడు 
అంటరానితనం అస్పృశ్యత నిర్మూలనకై
కృషిచేసిన నిర్విరామ పోరాటవీరుడు

అగ్రకులాల ఆధిపత్యపోరుని తట్టుకుని
నిలబడిన సమున్నత శిఖరం
వివక్ష, హేళనలు, అవమానాలపై
కొరడా ఝళిపించిన సింహస్వప్నం

దళితుల మహిళల కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన చైతన్యశీలి
సామాజిక న్యాయానికై పరితపించి
వారి జీవితాల్లో వెలుగులు నింపిన కాంతిరేఖ

న్యాయవాదిగా సర్వసత్తాక రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాత
ఆర్థికవేత్తగా ఆధునిక భారతదేశ చిత్రపటాన్ని అవనిలో ఆవిష్కరించిన ద్రష్ట
రాజకీయవేత్తగా సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సంఘసంస్కర్త

ఊరూరా వెలిసిన అంబేడ్కర్ విగ్రహాలు
భవిష్యత్తును దర్శింపచేసే మార్గదర్శకాలు
అంబేడ్కర్ అంటే నిలువెత్తు విగ్రహం కాదు
రేపటితరానికి దారిచూపే భవిష్యత్తు

హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన
అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం
మహానగరానికే మణిహారం !
తెలంగాణకే అసలైన ఆభరణం !!
భారతదేశ చరిత్రకే శిఖరాయమానం !!!